Dec 07,2021 06:43

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళదుంప వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దు చేస్తూ 'మొక్కల రకాల పరిరక్షణ మరియు రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ' శుక్రవారం నాడు తీర్పు ఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. అంతేగాక రైతులను నిలువరించటం కుదరదన్నది. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది.

    'లేస్‌' బంగాళదుంప 'చిప్స్‌' రకం మీద పేటెంట్‌ హక్కులను పెప్సీ కంపెనీ కోల్పోయింది. పెప్సీ కంపెనీ చేసుకున్న పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌ను 'ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ' ఈ నెల 3వ తేదీన రద్దు చేసింది. విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘన విజయమిది.
బంగాళదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు విత్తనాలను అందించి, బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది. 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఈ రకపు వంగడం పిపివిఎఫ్‌ఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల కింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది. 'చిప్స్‌' కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళదుంపపై పూర్తి హక్కులు మావేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. 'పెప్సీ కో ఇండియా హోల్డింగ్‌ యఫ్‌.సి-5' బంగాళదుంప రకాలను పేటెంట్‌ చట్టం కింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడంపై పూర్తి హక్కులు మా స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లైసెన్సు లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళ దుంపలను ఉపయోగించి లేస్‌ అనే బ్రాండ్‌ పేరుతో ''చిప్స్‌'' తయారుచేసి అమ్ముకుంటున్నది. చిరుతిళ్ళు, శీతల పానీయాలు తయారు చేసే పెప్సీకో ఒక పెద్ద బహుళజాతి కంపెనీ. ప్రపంచంలో అతి పెద్ద ఆహారపానీయాల వ్యాపార సంస్ధగా 200 దేశాలలో వ్యాపారం చేస్తున్నది. గత సంవత్సరం చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు అమ్మి మన దేశాన్నుండి రూ. 4.52 లక్షల కోట్ల లాభం పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకు లైసెన్సుపై బంగాళదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళదుంపలు కొనేట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కుపై దాడి చేస్తున్నది. తన విత్తనాన్ని తనే తయారు చేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.
     పెప్సీకో రెండు సంవత్సరాల క్రితం...గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు ఇవ్వమంటూ... మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టింది. ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా కోరింది. 2018 ఏప్రియల్‌ 8న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఎక్స్‌పార్టీ డిక్రీ ఇచ్చింది. రైతులు కోర్టులో లేకుండానే రైతులను విచారించకుండానే, రైతుల లాయర్‌ లేకుండానే మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే యావత్‌ భారత దేశ రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశవ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలో కూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీ కంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.
     కానీ విత్తనంపై హక్కు నాదే అని పెప్సీకో ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కి తగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారు చేసుకునే హక్కు లేదని కంపెనీ వాదిస్తూనే వుంది. రైతుల విత్తన హక్కును పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని, పిపివిఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని రైతుసంఘం నాయకురాలు కవితా కురుగంటి రైతుల తరపున పిటీషన్‌ దాఖలు చేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదే చట్టం లోని సెక్షన్‌ 39(1)ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశం వున్నది. ఈ చట్టం అమలు లోకి రాకముందు లాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని, పెప్సీ కంపెనీ యఫ్‌.సి-5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపివిఎఫ్‌ఆర్‌-2001 అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండ్‌ లేని విత్తనాలను అమ్మకునే హక్కు కూడా రైతుకు వుందన్నారు.
     పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళదుంప వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దు చేస్తూ 'మొక్కల రకాల పరిరక్షణ మరియు రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ' శుక్రవారం నాడు తీర్పు ఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. అంతేగాక రైతులను నిలువరించటం కుదరదన్నది. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ ఇప్పటి వరకూ వాదిస్తూ వుంది.
    ఈ తీర్పు వలన మన దేశ రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కార్పొరేట్‌ కంపెనీ అయినా విత్తనంపై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా పిపివియఫ్‌ఆర్‌ఎ ఛైర్‌పర్సన్‌ కె.వి.ప్రభు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఇది రైతు లోకం స్వాగతించవలసిన తీర్పు.

డా|| కొల్లా రాజమోహన్‌

డా|| కొల్లా రాజమోహన్‌