Sep 12,2020 08:11


పలుగు పారా పట్టిన దేహాలవి
జిలుగు పొలుగు తెలీని బతుకులవి
సుత్తి సేనం మన్నూ మశానం
కష్టాలే ఇష్టాలైన వృత్తులవి
నెత్తి మీద బరువు
కడుపులో ఆకలి
పేదవాడి కవచ కుండలాలు !
కష్టజీవి తన కష్టానికి యజమాని
కడుపులో స్వారీ చేసే
ఆకలికి మాత్రం బానిస
చెమట సంద్రంలో ఎంత ఈదినా
ఒడ్డు మొకం తెలీని
నిర్భాగ్య నావికుడు
శ్రామికుడు మట్టికొట్టుకుపోయినా
అతడి శ్రమ అద్దాల భవంతుల్లో
కాంతులీనుతుంది..
పేదోడి శ్రమకు అందరు దొంగలే
పేదోడి దగ్గరే బేరమాడతారు
పేదోడ్ని అలాగే చూడ్డాని కిష్టపడతారు
సొతంత్ర దేశంలో కష్టానికి
గుడ్డిగవ్వ విలువ లేదు
చచ్చినా బతికినా పేదోడు
చరిత్ర హీనుడే..
పేదరికం మాత్రం పెద్దోళ్లకు
పైకెళ్లే పరమపద సోపానాలు
నష్టం లేని రాజకీయ యాపారం
పేదరికం పేరు చెబితేనే
ఉపన్యాసాల నాలికలు ఊదరకొడతాయి
పేదల పథకాలే అధికారానికి పెట్టనికోట
పేదరికం అందరికీ వరమే
పేదోడికి మాత్రం శాపం !!