Feb 25,2023 20:15

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి : పేదరికంతో బాధపడుచున్న టిబి రోగులను దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ గిరీష పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో వైద్యశాఖ అధికారులతో టిబి రోగుల దత్తత, గర్భిణుల్లో రక్తహీనత, హైరిస్క్‌ ప్రెగెన్సీ బర్త్‌ ప్లానింగ్‌, 10-19 సంవత్సరాల బాలబాలికలకు వైద్య పరీక్షలు, ముఖ ఆధారిత హాజరు, తదితర పలు అంశాలపై కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద క్షయ రోగులకు పౌష్టిక ఆహారం అందించడానికి దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజా ప్రతినిధులను కలిసి టిబి రోగులను దత్తత తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. టిబి రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్న సదుద్దేశముతో నిర్దారిత టిబి రోగుల సమ్మతితో స్వచ్చంధ సంస్థలను, సేవాగుణం కలవారు మందులు వాడుచున్న టిబి రోగులకు 6 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టిబి రోగులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రక్తహీనతతో బాధపడుతున్న ప్రతి గర్భిణులను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని ఆదేశించారు. గర్భిణుకు టెస్టింగ్‌ వంద శాతం ఖచ్చితంగా చేయాలన్నారు. గర్భిణులకు రక్తహీనత సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోషకాహార ప్రాధాన్యతను వివరించాలన్నారు. ఎఎన్‌ఎంలు క్రమం తప్పకుండా బిపి, మధుమేహం, హిమోగ్లోబిన్‌ను పరీక్షించుట (చిన్నపిల్లలకు), తదితర పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టి పక్కా ప్రణాళికతో డెలివరీ డేట్‌కు ముందే ఆసుపత్రికి తరిలించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. హైరిస్క్‌ ప్రెగెన్సీలను గుర్తించడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. హైరిస్క్‌ ప్రెగెన్సీ పేషెంట్‌ల ట్రాన్స్పోర్ట్‌ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హై రిస్క్‌ ప్రెగెన్సీలను నాలుగు వారాలు ముందుగానే బర్త్‌ ప్లానింగ్‌ చేయించాలన్నారు. అనీమియా టెస్టింగ్‌ వంద శాతం జరగాలన్నారు. హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ జాగ్రత్తగా చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాల్లో వైద్య అధికారులు విజిట్‌ చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రధానంగా వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేసే 10 నుంచి 19 సంవత్సరాల బాలికలకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్‌సిడిసిడి సర్వే పెండింగ్‌ లేకుండా త్వరగా పూర్తి చేయాన్నారు. సమీక్షలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.