ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి విద్యార్థి విద్యలో రాణిస్తూ పది పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ధర్మవరం ఇన్‌ఛార్జి డీఎస్పీ హుస్సేన్‌పీరా కోరారు. పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో గల యశోద కాన్సెప్ట్ పాఠశాల 15వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన ప్రొఫెసర్, డీఎస్పీ మాట్లాడుతూ ప్రతివిద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం గత ఏడాది పదవ తరగతి పరీక్షలలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ శంకరనారాయణ, డైరెక్టర్ రవీంద్ర, కరస్పాండెంట్ మల్లికార్జున అభినందించి జ్ఞాపికతోపాటు రూ.5 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఫృథ్వీరాజ్, ప్రిన్సిపల్ అనూప్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










