Dec 12,2020 07:18

తాము కేవలం మూడు చట్టాల రద్దు కోసమే పోరాడటం లేదని...తమ సమస్యల పరిష్కారం కోసం, పంజాబ్‌ కోసం పోరాడుతున్నామని...పోరాటం చేస్తున్నవారిలో చాలామందికి తెలుసు. ''ప్రధాన స్రవంతి మీడియా'' వలె కాక... పౌర హక్కులను హరించే ఈ చట్టాలను రద్దు చేయాలని, న్యాయం కోసం న్యాయ వ్యవస్థను ఆశ్రయించే మన హక్కును రద్దు చేయటానికి వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. దేశ రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు.
        కొత్త వ్యవసాయ చట్టాలు కేవలం రైతుల కోసమేనని మీరు భావిస్తున్నారా? తమ చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వహిస్తున్న పౌర అధికారులపై కేసులు పెట్టటాన్ని నిరోధించే అంశాలు కూడా దానిలో ఉన్నాయి. కాని ఇది ఒక్కటి మాత్రమే పైకి కనిపిస్తుంది. 'మంచి ఉద్దేశంతో వారేం చేసినా' వాటికి పూర్తి మినహాయింపులను ఇచ్చారు. 'మంచి ఉద్దేశంతో' వారు చేసిన నేరాలకు కోర్టుల నుంచి మినహాయింపు ఇవ్వటమే కాకుండా, వారు చేయబోయే నేరాలకు కూడా చట్టం నుండి రక్షణ కల్పించారు. వారు చేసిన చర్యల నుండి కోర్టులు చట్టపరంగా మీకు రక్షణ కల్పించలేవు (మంచి ఉద్దేశాలతోనే కావచ్చు).
       ''ఈ చట్టం, చట్టం లోని నిబంధనలు కల్పించిన అధికారం ప్రకారం అధికారులు తీసుకున్న చర్యలలో, చేసిన సెటిల్‌మెంట్లలో జోక్యం చేసుకోవటానికి, న్యాయ క్రమం కొనసాగించటానికి సివిల్‌ కోర్టులకు ఎటువంటి అధికారం లేదు''. ''మంచి ఉద్దేశ్యంతో'' చేసే చర్యలను కోర్టులలో సవాలు చేయలేని ఈ ''ఇతర వ్యక్తులు'' ఎవరు?
ఊహించండి! నిరసనలు తెలియజేస్తున్న రైతులు వెల్లడిస్తున్న కార్పొరేట్‌ సంస్థల యజమానుల పేర్లు వినండి. ఇది బడా సంస్థల వ్యాపారాలను తేలిక చేయటమే. మరీ మరీ తేలికచేయటం. ''ఎటువంటి కేసులు, విచారణ, ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు''. ఇది కేసులు వేయలేని రైతులే కాదు. ఇతరులెవరూ కూడా వేయలేరు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు కూడా ఇది వర్తిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థలు, రైతు సంఘాలు, ఇతర పౌరులు ఎవరూ కూడా జోక్యం చేసుకోలేరు. పౌరుల హక్కులను, ఇటువంటి చట్టాలను పూర్తిగా రద్దు చేసిన ఎమర్జెన్సీ కాలంలో (1975-77) మినహా చూడలేదు.
        వీటివలన ప్రతి భారతీయుడి పైనా ప్రభావం పడుతుంది. కింది స్థాయిలో చట్టాలను అమలు చేసే అధికారి కూడా న్యాయాధికారిగా మారతాడు. వారే న్యాయం గురించి వాదించే వారుగా, న్యాయమూర్తులుగా, న్యాయాన్ని అమలు చేసేవారుగా మారతారు. ఇప్పటికే రైతులు, కార్పొరేట్లకు మధ్య అసమతుల్యంగా ఉన్న ఆధిపత్యం కార్పొరేట్లకు మరింత అనుకూలంగా మారుతుంది. ఈ చట్టాలతో ఆందోళన చెందిన ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ ఈ విషయాలను పేర్కొంటూ ప్రధానికి ఒక లేఖ రాసింది. అధికారులకు న్యాయ నిర్ణయ అధికారాన్ని ఇస్తే ''ఎంత ప్రమాదమో, ఎంత తప్పో'' పేర్కొంది.
        ఆలోచించండి. ఈ న్యాయవాదులు కేవలం రైతుల కోసమే ఉన్నారా? ధరలపై ఒప్పందం, వ్యవసాయ సేవల (రైతుల సాధికారత, రక్షణ) చట్టం-2020లో పలు అంశాలు వున్నాయి. సెక్షన్‌ 18 ''మంచి ఉద్దేశంతో'' అనే వాదనను మళ్ళీ ముందుకు తెస్తున్నది. సెక్షన్‌ 19 ఈ విధంగా చెబుతున్నది. ''ఈ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో సబ్‌ డివిజనల్‌ అధికారులు, అప్పిలేట్‌ అధికారులు తీసుకొనే, తీసుకోబోయే చర్యలపై ఇంజెక్షన్‌ ఇవ్వటానికి, ఏ విధమైన న్యాయపరమైన వ్యాజ్యాలు తీసుకోవటానికి, విచారణ కొనసాగించటానికి ఏ సివిల్‌ కోర్టుకు అధికారం లేదు''. వాక్‌ స్వాతంత్య్రం, శాంతియుతంగా సమావేశం కావటం, స్వేచ్ఛగా సంచరించటం, సంఘాలను, అసోసియేషన్లను ఏర్పాటు చేసుకోవటం కోసం భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19 ఇచ్చిన స్వేచ్ఛ గురించి ఆలోచించండి.
          ఈ వ్యవసాయ చట్టంలోని సెక్షన్‌ 19...రాజ్యాంగ పరంగా వరిష్కారాలను అన్వేషించటానికి రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 32 ఇచ్చిన హక్కులను (న్యాయపరమైన చర్యలు) వమ్ము చేస్తుంది. సెక్షన్‌ 32ను రాజ్యాంగం లోని మౌలిక స్వభావం గురించి చెబుతున్న వాటిలో ఒకటిగా భావిస్తారు.
       ఈ వ్యవసాయ చట్టాల వలన భారత ప్రజాస్వామ్యానికి ఎదురవబోయే సమస్యలను గురించి ''ప్రధాన స్రవంతి'' మీడియాకు (అది ప్రసారం చేసే వాటిలో 70 శాతం ప్రజల సమస్యలకు స్థానం దొరకదు) తెలియకపోలేదు. లాభాల కోసం వెంపర్లాడటం మినహా ప్రజాస్వామ్యం, ప్రజల ప్రయోజనాలు వారికి పట్టలేదు. భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ జరుగుతున్నదనే భ్రమలను వదిలివేయండి. మీడియా కూడా కార్పొరేటీకరణ అయింది. అతి పెద్ద భారతీయ కార్పొరేషన్‌కు అధిపతి, అత్యంత ధనవంతుడు అయిన అంబానీ అతి పెద్ద మీడియాకు కూడా అధిపతి. ఢిల్లీ లోని రైతులు కూడా తమ నినాదాలలో ప్రస్తావిస్తున్న పేర్లలో అంబానీది ఒకటి. దిగువ స్థాయిలో సైతం చాలా కాలం నుండి ఫోర్త్‌ ఎస్టేట్‌, రియల్‌ ఎస్టేట్‌ల మధ్య వ్యత్యాసం చూయించటం తగ్గిపోయింది. కార్పొరేట్ల ప్రయోజనాల కన్నా రైతుల ప్రయోజనాలను మాత్రమే కాక పౌరుల ప్రయోజనాలను కూడా ముందుకు తీసుకురాలేనంతగా లాభాల వేటలో ''ప్రధాన స్రవంతి'' మీడియా కూరుకుపోయింది.
           టి.వి లలో జరుగుతున్న రాజకీయ చర్చలలో రైతులను దురాలోచనలు కలిగిన వారిగా చూపటం, ధనిక రైతులే పాల్గొంటున్నారని, పంజాబ్‌ నుంచి మాత్రమే పాల్గొంటున్నారని, వారు ఖలిస్థాన్‌వాదులని, వంచకులని, కాంగ్రెస్‌ కుట్రదారులని రకరకాలుగా రైతులను విలన్లుగా చూపటానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు.
బడా పత్రికల సంపాదకీయాలు మొసలి కన్నీరు కారుస్తూ మరొక విధమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం దీనిని జాగ్రత్తగా పరిష్కరించి ఉండవలసిందని ప్రధానంగా చెబుతున్నాయి. రైతులు వాస్తవాలను చూడలేని వారిగా ఉన్నారని, వారు అర్ధం చేసుకొనే విధంగా చేయాలని... ప్రధాని, ఆయనతో ఉన్న ఆర్థికవేత్తలంతా జాగ్రత్తగా చట్టాలను రూపొందిస్తున్నారని...ఈ చట్టాలు వ్యవసాయ రంగానికి, మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమైనవని ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టాలు అత్యంత ముఖ్యమైనవి, అత్యవసరమైనవి, అందువలన తప్పనిసరిగా అమలు జరపాలని చెబుతున్నారు.
         ''ఈ విషయంలో తప్పు వ్యవసాయ చట్టాలలో లేదు. వాటిని ఆమోదించిన విధానంలో ఉంది. దానిని ప్రభుత్వం ప్రచారం చేసిన విధానం లేదా చేయకపోవటంలో ఉంది'' అని 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంపాదకీయం పేర్కొంది. అది ఈ మూడు వ్యవసాయ చట్టాల వలెనే అభివృద్ధి కోసం చేయబోయే ఇతర చట్టాలను కూడా ఈ ఆందోళనలు దెబ్బ తీస్తాయని ఎక్స్‌ప్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యవసాయ రంగం లోని అవకాశాలనన్నింటినీ వినియోగించుకోవాలంటే సంస్కరణలు తప్పనిసరి అని పేర్కొంది.
''కొద్ది కాలంలోనే మద్దతు ధరల విధానం అంతమైపోతుందనే రైతుల అపోహలను తొలగించటమే అన్ని ప్రభుత్వాల కర్తవ్యంగా ఉండాలని'' టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం పేర్కొంది. ''వ్యవసాయ వాణిజ్యంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచటానికి సంస్కరణల ద్వారా ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నం చేసిందని, రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటం ఈ సంస్కరణలు జయప్రదం కావటంపై ఆధారపడి ఉంటుంద''ని పేర్కొంది. ఈ విధమైన సంస్కరణలు ''దేశం లోని ఆహార మార్కెట్ల లోని నష్టదాయక అంశాలను కూడా'' తొలగిస్తాయని చెప్పింది.
        ''ఈ చట్టాలను తీసుకురావటంలో గొప్ప లక్ష్యాలు ఉన్నాయని'' హిందుస్థాన్‌ టైమ్స్‌ సంపాదకీయం పేర్కొంది. రైతాంగం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతూ రైతులు అస్తిత్వం కోసం పాకులాడుతున్నారని, తీవ్రవాదుల బాట పడుతున్నారని, వారికి అనుగుణమైన కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పింది. రైతులు ఏ కుట్రదారుల తరఫున పోరాటం చేస్తున్నారని ముద్ర వేయాలో తెలియక ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది. కాని ఈ సంపాదకీయాలు ప్రభుత్వం కన్నా ఎక్కువ స్పష్టతతో ఉన్నట్లు, తమకు నిధులు అందిస్తున్న కార్పొరేట్‌ యజమానులకు నష్టం కలుగకుండా చూస్తున్నాయి. మంచి టి.వి ఛానళ్లు అని పేరు పడ్డవి, తక్కువ పక్షపాతంతో వ్యవహరించేవి కూడా తమ చర్చలలో కార్పొరేట్‌ నిపుణులు, మేధావులు రూపొందించిన చట్రంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.
         కార్మిక చట్టాలను అంత హడావిడిగా ఇప్పుడే ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది? గత ఎన్నికలలో మోడీకి భారీ మెజారిటీ లభించింది. ఆ మెజారిటీ ప్రభావం ఆయనకు మరొక 2-3 సంవత్సరాలు ఉంటుంది. అనేక ఇతర సమస్యలు అత్యవసరంగా పరిష్కరించాల్సినవి ఉండగా... కోవిడ్‌ మహమ్మారి వ్యాపించిన వేళనే ఈ చట్టాలు చేయటానికి తగిన సమయంగా బిజెపి ఎందుకు ఎంచుకుంది?
కోవిడ్‌ మహమ్మారి వల్ల అంతా స్థంభించిపోయిందని, కార్మికులు, రైతులు సంఘటితమై వీటిని అడ్డుకోలేరని, కాబట్టి ఈ చట్టాలు తీసుకురావటానికి ఇదే మంచి సమయమని బిజెపి భావించింది. ప్రభుత్వానికి, కార్పొరేట్లకు మద్దతిస్తున్న నిపుణులు ఇది 1991 లాంటి సమయమని, ఎటువంటి తీవ్రమైన సంస్కరణలనైనా ప్రవేశపెట్టవచ్చునని, కరోనా వేళ, ప్రజలు కార్యశీలురుగా లేకపోవటంతో అస్థిర పరిస్థితులను సొమ్ము చేసుకోవచ్చునని భావించింది. ''ఒక మంచి సంక్షోభాన్ని వృధా చేయవద్దని'' అనేకమంది సంపాదకులు కోరారు.
ఇప్పుడు, ముఖ్యమైన రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అంశానికి వస్తాను. తన పరిధిలో లేని చట్టాలను చేయటం ద్వారా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించటానికి పూనుకున్నది. కమిటీని ఏర్పాటు చేద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు ఎందుకు అంత నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు అన్నదానిపై సంపాదకీయాలలో చర్చ జరగలేదు. కమిటీ వేయటానికి అంగీకరిస్తే నివేదిక రావాలి. మళ్ళీ దానిని అమలు చేయమని డిమాండ్‌ చేయాలన్న విషయం ప్రతి రైతుకు తెలుసు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ పడ్డాయి.
       ఆ నివేదిక లోని కీలకాంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2018 నవంబరు 18న పార్లమెంటు ముందు లక్ష మందికి పైగా రైతులు ప్రదర్శన చేశారు. రుణాల రద్దు, కనీస మద్దతు ధరలు, ఇతర సమస్యలతో పాటు వ్యవసాయ సంక్షోభాన్ని గురించి చర్చించటానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలని కోరారు. ఇపుడు ఢిల్లీలో డిమాండ్‌ చేస్తున్న వాటినే అపుడు అమలు చేయాల్సిందిగా కోరారు. రైతులు పంజాబ్‌ నుంచి మాత్రమే కాదు, 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వం నుండి కప్పు టీ కూడా తీసుకోవటానికి నికరాకరిస్తున్న రైతులు తమలో భయం, అశక్తత లేవని మనకు చూపుతున్నారు. తీవ్ర కష్టాలు ఎదురైనా వారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా, తమ హక్కుల (మన హక్కులు) కోసం నిలబడుతున్నారు. ఆహారం కార్పొరేట్ల చేతుల్లోకి పోతే దేశానికి ఏం జరగుతుందన్న విషయాన్ని వారు పదే పదే చెబుతున్నా, దానిని ''ప్రధాన స్రవంతి'' మీడియా విస్మరించింది. ఆలస్యంగానైనా ఒక్క సంపాదకీయం కూడా దానిపై రాలేదు.
          తాము కేవలం మూడు చట్టాల రద్దు కోసమే పోరాడటం లేదని...తమ సమస్యల పరిష్కారం కోసం, పంజాబ్‌ కోసం పోరాడుతున్నామని...పోరాటం చేస్తున్నవారిలో చాలామందికి తెలుసు. ఈ మూడు చట్టాలను రద్దు చేయటం అంతకు ముందు మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి తీసుకుపోదు. అది ఎప్పటికీ మంచిది కాదు. అంతకు ముందు సంక్షోభం ఉంది. ఈ చట్టాల రద్దు వ్యవసాయం లోని దుస్థితిని కొంత నెమ్మదింపచేస్తుంది. ''ప్రధాన స్రవంతి మీడియా'' వలె కాక...పౌరహక్కులను హరించే ఈ చట్టాలను రద్దు చేయాలని, న్యాయం కోసం న్యాయ వ్యవస్థను ఆశ్రయించే మన హక్కును రద్దు చేయటానికి వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. దేశ రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు. (వ్యాసకర్త సుప్రసిద్ధ జర్నలిస్టు,
 

'రామన్‌ మెగసెసే' అవార్డు గ్రహీత)

పి. సాయినాథ్‌

p.sainath