న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కిసాన్ ట్రాక్టర్ మార్చ్ చారిత్రాత్మకంగా సాగింది. వేలాది ట్రాక్టర్లతో అన్నదాతలు పెద్దఎత్తున కదం తొక్కారు. ఉదయం 11 గంటలకు ట్రాక్టర్ల ర్యాలీలు ఢిల్లీకి నలువైపులా ఉన్న కుండ్లీ, ఘాజీపూర్, రివాసన్, టిక్రీ సరిహద్దు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. సింఘూ నుంచి టిక్రీ వరకు, టిక్రీ నుంచి షాజహాన్‌పూర్ వరకు, ఘాజీపూర్ నుంచి పల్వాల్ వరకు, పల్వాల్ నుంచి ఘాజీపూర్ వరకు ఇలా నాలుగు ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహించారు. ఈ మార్చ్‌లు జనవరి 26న కిసాన్ రిపబ్లిక్ పరేడ్‌కు రిహార్సల్స్ గా నిర్వహించారు.
టిక్రీ నుంచి కుండ్లీ వరకు సాగిన ట్రాక్టర్ మార్చ్‌ను కుండ్లీ, మనేసర్, పల్వాల్ (కెఎంపి) ఎక్స్‌ప్రెస్ వే సంప్లా టోల్‌ప్లాజా వద్ద ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి విజూ కఅష్ణన్, కోశాధికారి పి.కఅష్ణ ప్రసాద్ తదితరులు పాల్గన్నారు. కుండ్లీ వద్ద ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు బాదల్ సరోజ్, ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శి విక్రమ్‌సింగ్ పాల్గన్నారు. సింఘూ నుంచి టిక్రీ వరకు సాగిన ట్రాక్టర్స్ మార్చ్ కుండ్లీ వద్ద ప్రారంభమైంది. ఈ మార్చ్‌ను సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దర్శన్ పాల్ తదితరులు ప్రారంభించారు. ఘాజీపూర్ నుంచి పల్వాల్ వరకు సాగిన మార్చ్‌ను దాస్నా వద్ద రైతు నేత రాకేష్ టికాయిత్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మార్చ్‌కు నాయకత్వం వహించారు. రేవాసన్ నుంచి పల్వాల్ వరకు సాగిన ట్రాక్టర్స్ మార్చ్‌ను రేవాసన్ వద్ద రైతు నేతలు ప్రారంభించారు. నోయిడా సమీపంలోని మహామాయ ఫ్లై ఓవర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చిల్లా సరిహద్దు వరకు కొనసాగింది.
వందలాది కిలోమీటర్ల మేర ర్యాలీలు
ట్రాక్టర్స్ మార్చ్ వందలాది కిలోమీటర్ల మేర సాగింది. దాదాపు ఐదు వేలకుపైగా ట్రాక్టర్లు, వేలాది కార్లు, ట్రాలీలు, ఆటోలు కూడా మార్చ్‌లో ఉన్నట్లు సంయుక్త కిసాన్ మార్చ్ నేత దర్శన్ పాల్ తెలిపారు. ఈ ట్రాక్టర్స్ మార్చ్ రైతుల ఐక్య శక్తిని మరోసారి రుజువు చేసిందని చెప్పారు. గ్రామాల, నగరాల ప్రజలు, కార్మిక సంఘాలు, ఇతర సామాజిక, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నిచోట్ల రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
దేశవ్యాప్త ట్రాక్టర్ ర్యాలీలు
దేశవ్యాప్తంగా రైతులు తమ ప్రాంతాల్లో ట్రాక్టర్ల కవాతులో పాల్గని ఢిల్లీ రైతులకు సంఘీభావం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో రైతులు తమ బ్లాక్, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ట్రాక్టర్ కవాతులు నిర్వహించారు. అన్ని ట్రాక్టర్స్ మార్చ్‌లలో మహిళా రైతులు కూడా పెద్దఎత్తున పాల్గన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని వివిధ పట్టణాల్లోని మార్చ్‌ల్లో భారీఎత్తున రైతులు పాల్గన్నారు. నర్మదా లోయలో రైతులు, కార్మికులు ఢిల్లీ వైపు ర్యాలీ నిర్వహించారు. పంజాబ్, హర్యానాలోని దాదాపు ప్రతి జిల్లాలో ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీలు చేశారు.










