హిందూపురం : 'మింగు మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె' అన్న సామెత హిందూపురం మున్సిపాల్టీకి అచ్చంగా సరిపోతోంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి పట్టణాభివద్దికి ప్రత్యేకంగా ఒక్క పైసా నిధులు కూడా రాలేదు. మున్సిపాలీటీ ఆదాయం అంతా కలిపినా ఏడాదికి రూ.20 కోట్లలోపే. ప్రతి నెలా మున్సిపాలీ తాగునీటి పథకాలకు, వీధి దీపాలకు కలిపి విద్యుత్ ఛార్జీలు రూ.కోటి చెల్లించాలి. పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న 300 మందికి పైగా ఉద్యోగులకు రూ.50 లక్షలు వేతనాల రూపంలో చెల్లించాలి. చెత్త తరలింపు వాహనాలతో పాటు ఇతరత్రా వాహనాలకు డీజిల్, మర్మతులు, అద్దెలు, మున్సిపాల్టీ సచివాలయాల నిర్వహణ తదితర వాటి కోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతోంది. ప్రతి నెలా రూ. 2 కోట్లు, మున్సిపాలీ ఖాతాలో ఉంటేనే బండి నడుస్తుంది. తగినంత ఆదాయం లేకపోవడంతో గొల్లపల్లి, తాగునీటి పథకం విద్యుత్ ఛార్జీలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దీంతో ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలకు మళ్లించింది. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.3.5 కోట్లు విద్యుత్ బకాయిల కింద మినహాయించి, మిగిలిన నిధులను మున్సిపాల్టీకి విడుదల చేశారు. మరో వైపు తాగునీటి పథకానికి గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇటీవల ప్రభుత్వం మున్సిపాల్టీ పేరిట రూ.45 కోట్లు అప్పు చేసి చెల్లించింది. దీనికి సంబంధించి ప్రతి నెలా రూ.26 లక్షలు వడ్డీ, రూ.24 లక్షలు అసలు కలిపి ఇఎంఐ రూపంలో రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నారు. గుత్తేదారుకు ఇంకా రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏడు ఏళ్ల పాటు నిర్వహణ చూడాల్సి ఉన్నా, అర్ధాంతరంగా తప్పుకొన్నారు. దీంతో నిర్వహణ భారం మున్సిపాల్టీపై పడింది. మరోవైపున పట్టణంలో ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటు చేసిన గుత్తేదారుకు రూ.12 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. గొల్లపల్లి తాగునీటి పథకం లేని సమయంలో మూడేళ్ల క్రితం వరకు పిఎబిఆర్ నుంచి నీటిని అందించిన గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.20 కోట్ల వరకు బకాయిలు అలాగే ఉన్నాయి. ఎల్‌ఇడిల సరఫరా గుత్తేదారు, గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు నోటీసులు మీద నోటీసులు ఇస్తున్నా, ఖజనా సొమ్ము లేక చెల్లింపులు చేయలేకపోతున్నారు. గత మూడేళ్లుగా అభివద్ధి మాట దేవుడెరుగు... మున్సిపాల్చీ నిర్వహణ అతి కష్టంగా సాగుతోంది.
ప్రతిపాదనలకు మాత్రం తగ్గేదేలే..
మున్సిపాల్టీ నిర్వహణ కోసం అధికారులు అష్టకష్టాలు పడుతుంటే, ప్రభుత్వం నుంచి పైసా నిధులు తీసుకురాని పాలకవర్గం మాత్రం, అభివద్ధి పనుల ప్రతిపాదనల్లో తగ్గడం లేదు. ప్రతి నెలా జరిగే మున్సిపల్ సమావేశంలో కనీసం రూ.6 కోట్లకు పైగా విలువైన పనులను ప్రతిపాదనలను సిద్ధం చేయడం, కౌన్సిల్ ఆమోదం తీసుకోవడం పరిపాటిగా మారింది. 18 నెలల క్రితం ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం రైల్వే రోడ్ విస్తరణ అంశంపై పెట్టారు. రోడ్డు విస్తరణకు తక్కువలో తక్కువ కనీసం రూ.10 కోట్లు అవసరం. రహదారి విస్తరణలో భవనాలు కోల్పోయే వారికి నష్టపరిహారం రూ. 3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి దాక రూ.కోటి ఇవ్వలేకపోయారు. పట్టణంలో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం కోసం రూ.కోట్లకు కోట్లు కేటాయిస్తూ, తీర్మానాలను ఆమోదించారు. అయితే ఆమోదం తెలిపిన పనుల్లో కనీసం 10 శాతం కూడా ప్ర్రారంభం కాలేదు. పూర్తి అయిన పనులకు బిల్లులు చెల్లించ లేదు. దీంతో పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. కాలనీలను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో రహమత్ పురం, అబాద్ పేట, మేళాపురంలో అక్రమణలను తొలగించారు. అయితే అక్కడా పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా తాజాగా సోమవారం నిర్వహించే మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ ఆమోదానికి దాదాపు రూ.7 కోట్లకు పైగా విలువైన పనులను ప్రతిపాదించడానికి కౌన్సిల్ ముందు తీసుకు రావాడం గమనర్హం.
మున్సిపల్ కార్యాలయం










