Nov 27,2022 21:49

పాఠశాల ముందు గడ్డిని తొలగిస్తున్న విద్యార్థి

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని స్థానిక మహాత్మ జ్యోతిరావ్‌ పూలే గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులతో పలుగు పార పట్టించి కూలి పనులు చేయిస్తున్నారు. పిల్లలను విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే వారిని కూలీలుగా మారుస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నారుల చేతులకు కాయలు కాసేలా పనులు చేయిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాఠశాల ముందర ఉన్న చెట్ల చుట్టూ గడ్డిని తొలగించే పనిని ఆదివారం చేపట్టారు. పలుగు గడ్డపార చేత పనులు చేయించారు. ఆ పనిముట్లను ఎలా వాడాలో కూడా తెలియని విద్యార్థులతో ఆ పనులు చేయిస్తే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఆదివారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చూసేందుకు వచ్చారు. కానీ సిబ్బంది అవేవీ పట్టించుకోకుండా కనీసం వారి తల్లిదండ్రులతో కూడా కాసేపు మాట్లాడనివ్వకుండా పనులు చేయించారు. అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందారు. సంబందిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.