న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి మైనస్ 8 శాతం క్షీణించే అవకాశాలున్నాయని ఫిక్కీ ఎకనామిక్ అవుట్‌లుక్ సర్వేలో పేర్కొంది. పరిశ్రమలోని బ్యాంకింగ్, విత్త సేవల్లోని ఆర్థిక నిపుణుల అభిప్రాయాల ఆధారంగా వృద్థి రేటును అంచనా వేసింది. ఈ సర్వేను ప్రస్తుత జనవరిలో చేపట్టింది. జిడిపికి వ్యవసాయ రంగం దన్నుగా నిలువనుందని.. పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇతర రంగాలతో పోల్చితే ఆర్థిక వ్యవస్థ మరింత పడిపోకుండా వ్యవసాయ రంగం ఆదుకుందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు 3.5 శాతం వృద్థిని కనబర్చనున్నాయి. కరోనా సంక్షోభంలోనూ వ్యవసాయ రంగం అత్యంత ప్రగతిని కనబర్చింది. రబీ కాలంలో అధిక దిగుబడులు వచ్చాయి. వర్షాలు మెరుగ్గా ఉండటంతో రిజర్వాయర్లు నిండటం, ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం తదితర అంశాలు వ్యవసాయ రంగానికి ప్రధాన మద్దతును అందించాయి.
మరోవైపు కరోనా కాలంలో పరిశ్రమ, సర్వీస్ సెక్టార్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ రంగాలు వరుసగా 10 శాతం, 9.2 శాతం చొప్పున పడిపోవచ్చు. పారిశ్రామిక రంగం పుంజుకుంటున్నప్పటికీ.. ఇప్పటికీ విస్తృతంగా ఏమీ లేదు. పండగ సీజన్‌లో వినిమయ కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో జిడిపి మైనస్ 1.3 శాతం పడిపోవచ్చని ఈ రిపోర్ట్ అంచనా వేసింది. మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికంలో కేవలం 0.5 శాతం పెరిగి సానుకూలంగా నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషించింది. ప్రపంచ దేశాల నగదు లభ్యత పరిస్థితులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే బడ్జెట్‌లో నిర్మాణం, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం వ్యయాలు పెంచొచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెరుగొచ్చని అంచనా వేశారు.
2020లో 9.6% పతనం : ఐక్య రాజ్య సమితి
గడిచిన ఏడాది 2020లో భారత జిడిపి 9.6 శాతం క్షీణించే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి తాజాగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం పతనమయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) విశ్లేషించింది. లాక్‌డౌన్ ఇతర నిబంధనలు దేశీయ వినిమయాన్ని దెబ్బతీశాయని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంచనాలు 2021 అంశంపై ఐక్యరాజ్య సమితిలోని ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ (యుఎన్ డిఎస్‌ఎ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులోని అంశాలు.. ప్రస్తుత ఏడాదిలో తిరిగి 7.3 శాతం పెరుగుదల నమోదు కావొచ్చని అంచనా. శతాబ్దంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత పతనాన్ని చవి చూసిందని పేర్కొంది. గతేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.3 శాతం క్షీణించింది. 2009 నాటి ఆర్థిక సంక్షోభంతో పోల్చితే రెండున్నర రేట్లు ఎక్కువ. వచ్చే ఏడాది 2021లో తిరిగి 4.7 శాతం పెరుగొచ్చని ఈ రిపోర్ట్ పేర్కొంది.
భారత్ 2021లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 7.3 శాతం వృద్థిని నమోదు చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. 7.2 శాతం వృద్థితో చైనా రెండో స్థానంలో నిలువొచ్చు. దక్షిణాసియా ఆర్థికాభివృద్థి 6.9 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రీజియన్ 2020లో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. వచ్చే ఏడాది వాణిజ్యం, రెమిటెన్స్, పెట్టుబడులు పెరుగొచ్చని ఈ రిపోర్ట్ అంచనా వేసింది. వినిమయం పెరగడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడటానికి వీలుంది. 2022లో సౌత్ ఏసియా దేశాలు 5.3 శాతం వృద్థిని నమోదు చేయవచ్చు. కరోనా కాలంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో అసంఘటిత రంగంలోని 80 శాతం కార్మికులు అత్యంత ప్రభావితం అయ్యారు.










