Aug 17,2022 20:51

ఆర్‌బిఐ అంచనా కంటే తక్కువే
ముంబయి : 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అంచనాల కంటే జిడిపి తక్కువగా నమోదు కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 16.2 శాతం వృద్థి నమోదయ్యే అవకాశాలున్నాయని ఆర్‌బిఐ అంచనా వేయగా.. ఇది 14.5 శాతం నుంచి 16 శాతం లోపునకు పరిమితం కావొచ్చని భావిస్తున్నారు. కరోనా రెండో దశ తర్వాత గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి 20.1 శాతం పెరిగింది. ఇంతక్రితం ఏడాది ఇదే జూన్‌ త్రైమాసికంలో 8.5 శాతంగా చోటు చేసుకుంది. విదేశీ భౌగోళిక పరిణామాలకు తోడు దేశీయంగా పలు ప్రతికూలతలు  నెలకొన్న నేపథ్యంలో గడిచిన జూన్‌ త్రైమాసికంలో వృద్థి తగ్గొచ్చని కేర్‌ ఎడ్జ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ రాజ్నీ సిన్హా పేర్కొన్నారు. వాహన, రవాణ, బ్యాంకింగ్‌ రుణ రంగాల రికవరీలో పెరుగుదల ఉన్నప్పటికీ.. వినిమయంలో ఇప్పటికీ బలహీనతలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. జూన్‌ త్రైమాసికంలో 14.5 శాతం నుంచి 15 శాతం వృద్థి నమోదయ్యే అవకాశాలున్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్‌ మదన్‌ సబ్నవిస్‌ పేర్కొన్నారు