Jul 15,2021 21:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : తెలంగాణలోని పాలమూరుారంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పరిశీలించడానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయంటూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)ని గురువారంనాడు ఆశ్రయించారు. గతంలో పర్యావరణ అనుమతులు వచ్చేదాకా తాగునీటి కోసమే ఈ ప్రాజెక్టు చేపడతామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని రైతులు ఫిర్యాదు చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం గత ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని వివరించారు. అలాగే నిబందనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో లేదో సమీక్షించేందుకు ఎన్‌జిటి ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరారు . వీరి ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్‌జిటి ప్రాజెక్టు పనుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరాలని నిర్ణయించింది. తదుపరి విచారణ ఆగస్టు 29కు వాయిదా వేసింది.