భువనేశ్వర్ : ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారీ నజరానా ప్రకటించారు. ఈ నెల 23 నుండి మొదలు కానున్న టోక్యో ఒలంపిక్స్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు పతకాలు సాధిస్తే భారీ నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే.. రూ. 4కోట్లు, కాంస్య పతకానికి రూ. 2.5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అలాగే ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ రూ. 15 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఒలంపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశమైన ఆయన ఈ నగదు ప్రోత్సహాకాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒలంపిక్స్‌లో ఆడాలనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. తమ రాష్ట్రం నుండి ఒలంపిక్స్‌కు వెళుతున్న ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, నమిత టప్పొ, అమిత్ రోహిదాస్, దీప్ గ్రేస్ ఎక్కా, వీరేంద్ర లక్రాకు అభినందనలు తెలిపారు. ఒడిశా యువతకు మీరు రోల్ మెడల్స్ అని, మీ కుటుంబంతో పాటు రాష్ట్రానికి గర్వకారణమని అభినందించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఒలంపిక్స్‌లో ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.










