Jul 20,2023 15:02

న్యూఢిల్లీ   :   నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విషయంలో గురువారం కీలక ప్రకటన చేసింది. ఇకపై భారత్‌లోనూ పాస్‌ వర్డ్‌ షేరింగ్‌ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో కొత్త ఆదాయ మార్గాల అన్షేషణను ప్రారంభించింది. దీనిలో  భాగంగానే  గతేడాది మేలో ఈ విధానంపై  ప్రకటన చేసింది.  అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ సహా మొత్తం 100కు పైగా దేశాల్లో పాస్‌ వర్డ్‌ షేరింగ్‌ పై పరిమితులను విధించిన సంగతి తెలిసిందే.  

ఈ విధానాన్ని భారత్‌ లోనూ అమల్లోకి తెచ్చింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి వుంటుందని స్పష్టం చేసింది. వినియోగదారుల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీషోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. ఇంకా ప్రొఫైల్‌ను బదిలీ చేయడం అలాగే యాక్సెస్‌, డివైజెస్‌ మ్యానేజ్‌ చేయడం వంటి కొత్త ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది.