హైదరాబాద్ : విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు చేస్తున్న ఆందోళనలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది నర్సులను అరెస్టు చేశారు. ఈ తోపులాటలో ఓ నర్సుకు గాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు ఉందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసేందుకు శుక్రవారం ర్యాలీగా బయలుదేరారు. దీంతో హైదరాబాద్ గాంధీభవన్ వద్ద నర్సుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో నర్సులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. 20 మంది నర్సులను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో మమత అనే నర్సుకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మద్దతు తెలిపారు.











