Apr 17,2023 16:14
  • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తాం 
  • పారిశ్రామిగీకరణతో నిరుద్యోగ యువతకు ఉపాధి
  • లోకేష్ యువగలం పాదయాత్రకు జననీరాజనం

ప్రజాశక్తి- దేవనకొండ : రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న వేదవతి, నగర డోనా, హంద్రీనీవా, ఎల్ ఎల్ సి,, ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం యువగలం పాదయాత్ర మండలంలోని ఎంకే కొట్టాల గ్రామం నుండి గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బుర్రకుంట, వెంకటాపురం గ్రామాల మీదుగా సాగింది. ఆయా గ్రామాల్లో నారా లోకేష్ యువగలం పాదయాత్రకు జననీరాజనం పట్టారు. గ్రామంలో ఆ గ్రామ టిడిపి నాయకులు నీలకంఠం, రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో గజమాలను లోకేష్, కోట్ల సుజాతమ్మకు వేశారు. గుడిమిరాళ్ల గ్రామస్తులు హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా పి కోటకొండ వరకు పిల్ల కాలువల నిర్మాణాలను చేపట్టి సాగు నీరు ఇవ్వాలని వినతి పత్రం ఆ గ్రామ నాయకుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో సమర్పించారు. సబ్సిడీ ద్వారా గొర్రెల పెంపక దారులకు గొర్రెల యూనిట్లు, మందులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన నారా లోకేష్ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. బుర్రకుంట గ్రామ సమీపంలో ఆలూరు నియోజకవర్గం పరిధిలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ మండలాల రైతులు రైతాంగ సమస్యలను విన్నవించారు. ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో టమోటా పంటను సాగు చేస్తారని జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయా మండలాల రైతులు విన్నవించారు. అందుకు స్పందించిన ఆయన జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తెర్నేకల్ గ్రామ రైతు ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు చెల్లిస్తున్న వేతనాల్లో కోత విధించారని, హంద్రీనీవా పంట కాలువల అసంపూర్తిగా ఉన్నాయని తక్షణమే వాటిని పూర్తి చేయించాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. పొట్లపాడు రైతు లక్ష్మన్న మాట్లాడుతూ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర గత రెండేళ్లుగా లేకపోవడంతో రైతుల తీవ్ర అవస్థలు పడుతున్నారని దీంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. అందుకు స్పందించి నారా లోకేష్ మాట్లాడుతూ గత నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి పరిశ్రమలు స్థాపించలేకపోయారని టిడిపి ప్రభుత్వం వస్తే కర్నూలు జిల్లాకు పరిశ్రమలు పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ్యాపార వర్గాల నుండి తెప్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసి పండ్ల తోటల పెంపకాన్ని రైతులతో చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు గైకొనకపోవడంతో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్ర మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. మిగులు గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామన్నారు. టిడిపి హాయంలో 72% పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీనీ వైసిపి ప్రభుత్వం ఎత్తేసిందని, సబ్సిడీ రైతు రథాలు, వ్యక్తిగత వ్యవసాయ స్ప్రేయర్లు, పనిముట్లు ఇవ్వడం లేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు వారు ఏ విధంగా చెప్పితే ఆ విధంగా పాలన చేస్తుందని మీటర్లు బిగించడానికి వస్తే తిరుగుబాటు సూచించారు. పాలన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని పదవిలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకే పాలన గాడి తప్పి పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్టీసీ బస్సు రూపంలో, కరెంటు చార్జీల రూపంలో పెను భారం మోపడం దారుణం అన్నారు. కార్యక్రమంలో టిడిపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆలూరు, మంత్రాలయం, ఆత్మకూర్ టిడిపి ఇన్చార్జిలు కోట్ల సుజాతమ్మ, తిక్కా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి , ఆలూరు టిడిపి మాజీ ఇంచార్జీలు వీరభద్ర గౌడ్, వైకుంఠ మల్లికార్జున చౌదరి, టిడిపి పారిశ్రామికవేత్త మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్ ఆయన భార్య జ్యోతి, మసాలా పద్మజ, ఆస్పరి మాజీ జెడ్పిటిసి కప్పట్రాళ్ల బోజ్జమ్మ,, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు, మండల టిడిపి కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, నాయకులు బడి గింజల రంగన్న, రామారావు నాయుడు, మల్లికార్జున గౌడ్, వెంకట స్వామి గౌడ్, రాజశేఖర్ గౌడ్, బండ్లయ్య, మాలిక్ బాషా, రాజా సాబ్, సర్పంచులు శేషి రెడ్డి , భాస్కర్, వెంకటేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.