Nov 29,2022 21:18

ఫ్యాక్షన్‌ భయం

       అనంతపురం ప్రతినిధి : కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా ముఠా రాజకీయాలకు పెట్టింది పేరు. అయితే గత కొంత కాలంగా ముఠా రాజకీయాలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. ఇటువంటి తరుణంలో మరోమారు నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధాలు జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యక్తిగతమైన దూషణలు, హెచ్చరికలు హద్దులు దాటి వస్తుండటంతో తిరిగి ముఠా కక్షలు రాజుకుంటున్నాయా అన్న సందేహాలను రెకెత్తించే విధంగా ఉంటున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి, పెనుకొండ నియోజకవర్గాల్లో ముఠాకక్షలు అధికంగా ఉండేవి. అవి క్రమక్రమంగా తగ్గుతూ రావడంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. 2014 నుంచి చూస్తే ఒకటి, రెండు మినహా పెద్దగా ముఠాకక్షలు చోటు చేసుకోలేదు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డి హత్య ముఠా కక్షల్లో భాగంగా జరిగింది. ఆ తరువాతి కందుకూరులో ఒకటి చోటు చేసుకుంది. అటు తరువాత ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోలేదు. సాధారణంగా పార్టీ అధికారం మారాక పలు హింసాయుత ఘటనలు చోటు చేసుకునేవి. 2019లో టిడిపి అధికారంలోకి పోయి వైసిపి అధికారంలోకి వచ్చాక అటువంటి ఘటనలుంటాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో నేతల మాటలు మరోమారు అందరిలోనూ కలవరాన్ని సృష్టిస్తున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి మొద్దుశీనుకు చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడిని హత్యచేసే వాడంటూ చేసిన వ్యాఖ్యలు సోషియల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పరిటాల రవీంద్ర హత్య ఉదంతాన్ని ఆయన లేవనెత్తడంతో పాత రోజులను తిరిగి తీసుకురానున్నారా.? అన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకు మునుపు తాడిపత్రిలోనూ ఆ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి అస్మిత్‌రెడ్డి ఒక వార్డులో పర్యటిస్తూ ఉండగా అధికారపార్టీ నేతలు రాళ్లతో దాడి ఘటన కూడా కలకలం రేపింది. రాయదుర్గం నియోజకవర్గంలోనూ ప్రతిపక్ష నాయకులపై దాడి చేసారన్న ఆరోపణలున్నాయి. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తిరిగి ముఠాకక్షలను పెంచే విధంగా ఉన్నాయన్న భయం జిల్లావాసుల్లోనూ మొదలవుతోంది. 2007కు ముందు వరకు జిల్లాలో పెద్దఎత్తున ముఠాకక్షలు చోటు చేసుకునేవి. ఆ తరువాత ప్రభుత్వాలు తీసుకొచ్చిన చర్యలతో కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. తిరిగి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఏమి జరుగుతుందోనన్న భయం జిల్లా వాసుల్లో నెలకుంటోంది. ఈ ఘటనల్లో పోలీసుల తీరు పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కొంత వరకు కఠినంగా వ్యవహరించే విధంగా ఉంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతల కనుసన్నల్లోనే క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లలోనూ అధికారపార్టీ నాయకులు అధికారుల సమక్షంలోనే చేయిచేసుకున్నా మౌనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికార యంత్రంగం నిష్పపక్షపాతంగా వ్యవహరించకపోతే నివురుగప్పిన నిప్పులావున్న ముఠా కక్షలు మరోమారు పురుడుపోసుకునే అవకాశాలున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం.