Jul 14,2021 16:46

తిరుపతి : నిత్య పెళ్లికూతురు అవతారమెత్తి..లక్షల రూపాయల్ని దండుకుంటున్న కిలేడి. పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేస్తున్న సుహాసిని అనే మహిళను చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సిఐ దేవేంద్ర కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... విజయపురం మండలానికి చెందిన సునీల్‌ కుమార్‌ తిరుపతిలోని మార్కెట్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని ఆమె అతనికి చేరువైంది. అనంతరం సునీల్‌ తన తల్లిదండ్రుల్ని ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అత్తమామలు ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు.
వివాహమైన కొద్దిరోజుల తర్వాత.. ఆమె తనని చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షల రూపాయలు తీసుకుంది. కొన్నాళ్లకు డబ్బు విషయమై భర్త ఆమెను నిలదీయగా.. మరుసటిరోజే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై భర్త అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుహాసినికి నెల్లూరు చెందిన తన మేనమామతోనే గతంలో వివాహమైందని.. వారికి ఇద్దరుపిల్లలు కూడా ఉన్నారని విషయం వెలుగులోకి వచ్చింది.
సునీల్‌ తన గురించి ఆరా తీస్తున్నాడని తెలుసుకున్న సుహాసిని అతనికి ఫోన్‌ చేసి తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయినట్లు చెప్పింది. అవాక్కైన అతను ఈ విషయాన్ని పోలీసులతోపాటు మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళ బాధితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వినరు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొదటి భర్త సహకారంతోనే ఈ తరహా మోసాలకు సదరు మహిళ పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.