అమరావతి : రాష్ట్రంలో మొదటిసారి నిరుద్యోగుల ఆత్మహత్యా ఘటనలు చూస్తున్నామని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు మరింత పెంచబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఫైనాన్సియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్‌లో ఎపిని అధోగతి పాలు పట్టించారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎపి బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించినా.. జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవడం లేదని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఆర్ధిక శాఖ సమర్పించిన సమగ్ర అప్పుల నివేదిక చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారని వివరించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం కన్నా అధికంగా రూ.17,924 కోట్ల అప్పులు ముందే చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీలో అప్పుల కోసం చక్కర్లు కొట్టిన కొద్ది రోజుల్లోనే.. కేంద్రం రుణ పరిమితిలో కోత పెట్టడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ఎన్‌కె సింగ్ నేతృత్వంలోని ఎఫ్‌ఆర్‌బిఎం రివ్యూ కమిటీ ఏప్రిల్ 2020లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముందే హెచ్చరించిందని, దీన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల నిష్పత్తి 17 శాతం కాగా.. ఎపి ప్రభుత్వం అత్యంత దారుణంగా 31.46 శాతంగా ఉందని కమిటీ చెప్పిందన్నారు. దేశంలోనే అప్పు భారం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఎపి మూడవ స్థానంలో ఉండటం జగన్ దివాలకోరు ఆర్ధిక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో మరింత పన్నుల భారం పడనుందని ఆవేదన వ్యక్తంచేశారు.










