Jul 09,2021 10:32

బాపట్ల (గుంటూరు) : మరో నెలరోజుల్లో యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అతని తల్లిదండ్రులకు విషాద వార్త వినిపించింది. జమ్ముకాశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందారు. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
     శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని జశ్వంత్‌ రెడ్డి తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందించారు. జవాన్‌ మఅతదేహం ఈరోజు రాత్రికి బాపట్లకు చేరుకోవచ్చని అధికారుల నుంచి సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జశ్వంత్‌ 2016 లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరారు. తొలుత నీలగిరిలో పనిచేశారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించాడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.