ఎర్రావారిపాళెం (చిత్తూరు) : ఓ ట్రాక్టర్ డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బిక్కుబిక్కుమంటూ భయంతోనే ఉన్న ఆ డ్రైవర్ తప్పించుకున్నాలే అనుకున్న కాసేపటికే పోలీసులకు దొరికిపోయాడు. ఇదిలా ఉండగా, గంట వ్యవధిలోనే ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులకు పట్టించింది ఓ పెన్‌క్యాప్. వివరాలోకి వెళితే.. మండలంలోని ఆవులయ్యగారిపల్లెకు చెందిన గురవయ్య దామలచెరువులో ట్రాక్టర్ మామిడికాయలు దించి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. నెరబైలు గ్రామం పులిబోనుపల్లె సమీపంలో సిద్దలవాండ్లపల్లెకు చెందిన కంచన ఈశ్వరయ్య, రెడ్డెప్ప బోడేవాండ్లపల్లె నుంచి బైక్‌పై ఎదురుగా వస్తూ ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ సంఘటనలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా.. రెడ్డెప్ప స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అయితే, కేసు తనమీదకు వస్తుందేమోననే భయంతో ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ గురవయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటమోహన్ స్థానిక యువకులను అప్రమత్తం చేశారు. గురవయ్య ట్రాక్టర్‌ను గుర్తించి విచారణ చేశారు. విచారణలో ఎంత సేపటికీ తన ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని అంగీకరించలేదు. అయితే, ఈశ్వరయ్య పెన్ క్యాప్ ట్రాక్టర్ ట్రాలీకి తగులుకుని ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ట్రాక్టర్‌ను, గురవయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.










