Jul 15,2021 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు పెద్దఎత్తున పాల్గనాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్‌ రంగంలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు సుమారు 40 వేల మందికి సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే కార్మికులు దశాబ్దాల తరబడి వేతన దోపిడికీ గురవుతున్నారని, పాలకులు ఎందరు మారినా.. వీరి జీవితాల్లో మార్పు రావడం లేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని మాటిచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు మధ్య విభజన రేఖ గీయడమే కాక అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను శాశ్వత బానిసలుగా మారుస్తూ ఆప్కాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానం వల్ల కార్మికులు ఏడాది నుంచి అభద్రతను ఎదుర్కొంటున్నారని, ఏ విధమైన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించకుండా నిర్ధాక్షిణ్యంగా 60 ఏళ్లు దాటిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.