Dec 27,2020 07:11

 'చరిత్ర మనం కోరుకున్నట్టు నడవాలనుకుంటాం. కాని నడవదు' అంటాడు ఇ.హెచ్‌. కార్‌. 'పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను' అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటలు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాలను 2000 నాడు హంగామా చేసిన 2020 విజన్‌లతో పోల్చి చూసుకుంటే చాలా అంశాలు అర్ధమవుతాయి. కలలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకుల కదన శంఖారావాలతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాలన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతాల విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారువాలాగా మారిన మోడీ02 తొలి చర్యలతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాలయాలపై విద్వేష దాడులు, సిఎఎ వ్యతిరేక ఆందోళనలపై అణచివేతలు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పాలనా పరమైన సవాళ్లు చాలనట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు బయటపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అలసత్వం ప్రదర్శించింది. ప్రజలలోనైతే భయాందోళనలు మొదలైనాయి.
సిఎఎ వ్యతిరేక ఆందోళనల కేంద్రంగా వున్న అదే ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో...70లో 62 స్థానాలు గెల్చుకుని ' ఆప్‌ ' ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారిపోవడం అందులోనూ విద్యాధికులు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢిల్లీలో ఓటమి తొలి దెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢిల్లీలో హిందూత్వ శక్తులు దాడులకు పాల్పడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెలరేగాయి. ఆందోళనలు తీవ్రమై ఢిల్లీ స్తంభించిపోయింది. ఈ కల్లోలం మధ్యనే మోడీ నిర్వహించిన 'నమస్తే ట్రంప్‌' కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికలు వస్తున్నా ఖాతరు చేయకుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వెల్లడించింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకాల మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాలు చేపట్టారు.
కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోలు పెడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటించాలన్నారు.12 గంటలు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ఇతరుల పట్ల గౌరవ సూచకంగా పళ్లాలు చప్పుడు చేయాలని, చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకలు ఆగిపోయాయి. మొహాలకు మాస్కులు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవులు ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథలు జాతిని కలచివేశాయి. ఈ సమయం లోనే ఢిల్లీ లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నెల మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాలపై కేంద్రం, బిజెపి, దాని అనుకూల మీడియాలు కేంద్రీకరించాయి. కాని ఎ.పి, తెలంగాణలతో సహా కరోనా సవాలు పెరిగింది. ఇది చాలనట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాలంలోనే మే 7వ తేదీన విశాఖపట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాలు పెరిగి, ప్రజా జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శలు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాలు ఆర్డినెన్సులుగా జూన్‌ 7న సంతకాలు చేశారు. ఈ నెల లోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20 మంది సైనికులు మరణించడం, చైనా యాప్‌ లను నిషేధించడం వంటి పరిణామాలు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈ నెల లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాలు ఫలించలేదు.
ఆగష్టు నెల దేశానికి అనేక విషాదాలు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానాశ్రయంలో ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో డా||రమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11 ప్రాణాలు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వల్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వల్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజలు, శ్రమజీవులు రోజు గడవక నానా అవస్థల పాలవుతుంటే కరోనా మరణాలు, చికిత్స సదుపాయాలు లేక, నిబంధనలు కూడా తేలక విషాదం తాండవించింది. ఈ సమస్యలతో గాని నిబంధనలతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా వున్న అద్వానీ తదితరులను సెప్టెంబరులో అలహాబాద్‌ హైకోర్టు విడుదల చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాలను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధలను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌...బిజెపి-జెడియు సర్కారును బలంగా సవాలు చేసింది. కాంగ్రెస్‌ కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వల్ల, మజ్లిస్‌ వంటి పార్టీలు ఓట్లనూ ప్రజలనూ చీల్చడంలో బిజెపి వ్యూహాలకు తోడ్పడ్డం వల్ల కొద్దిలో తప్పిపోయింది.
ఈ కాలమంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోలు, గ్యాస్‌ వంటి వాటి ధరలు తగ్గించే బదులు పదే పదే పెంచుతూ ప్రజలపై భారాలు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాలని వచ్చిన సూచనలు పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీలన్నీ కురిపించింది. వీటివల్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షాల ప్రతిఘటనలపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువుల హత్య వంటి వాటిపై లేనిపోని చర్చలతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాలు అమలు చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటిల ప్రచారాలు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థలు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీయంగా వెల్లడైంది. ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో కేసుల పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శలు, వివాదాలు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా.
నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెలంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీలంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యలక్ష్మి ఆలయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆలయ భూములు, ఎ.పి లోనూ దేవాలయాల రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాలకు రావలసిన నిధుల మంజూరు లోనూ విభజన సమస్యల పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు సూటిగా ఎదుర్కొనలేకపోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శలు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు లోబడిపోవచ్చుగాని...ప్రజలు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనలతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతుల దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ పల్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాలకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాలకు వెళ్లవలసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాలకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాలను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాలు, లౌకిక పార్టీలు, ఇతర పత్యామ్నాయ శక్తులు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటుతున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే.

                                                                                     నాటి కలల 2020.. నేటి కదన శంఖాల 2020..                   - తెలకపల్లి రవి