బెంగళూరు : కర్ణాటకలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్తృతి (యుసిసి), జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సి)ను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. సోమవారం బిజెపి తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. 'ఒక ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా కర్ణాటకలో మేం యుసిసిని అమలు చేస్తాం' అని మ్యానిఫెస్టోలో బిజెపి తెలిపింది. అలాగే, 'కర్ణాటకలో మేం జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సి)ను ప్రవేశపెడతాం. రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులందర్నీ వేగంగా బహిష్కరిస్తాం' అని కూడా మ్యానిఫెస్టోలో బిజెపి పేర్కొంది.
ఉమ్మడి పౌర స్మృతిని దేశ రాజ్యాంగం అనుమతిస్తుందని, 'అందరీకి న్యాయాం ఎవ్వరీని బుజ్జగించడం మా విధానం కాదు' అని మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా వ్యాఖ్యానించారు. అలాగే, మతపరమైన ఛాంధసవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా 'కర్ణాటక స్టేట్ వింగ్ ఎగైనెస్ట్ రిలీజినియస్ ఫండమెంటలిజం అండ్ టెర్రర్ (కోఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టి)'అనే ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేస్తామని జెపి నడ్డా తెలిపారు.
- ఏడాది మూడు గ్యాస్ సిలెండర్లు, రోజుకు అర లీటరు పాలు
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే బిపిఎల్ కుటుంబాలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళికి ఈ సిలెండర్లు అందిస్తామని చెప్పింది. సరసమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి రాష్ట్రంలోని ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులోనూ 'అటల్ ఆహార కేంద్రం'ను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చింది. అలాగే ప్రతీ బిపిఎల్ కుటుంబానికి ప్రతీ రోజూ అర లీటర్ 'నందిని' పాలు, నెలవారీ రేషన్ కిట్‌లో ఐదు కేజీల 'శ్రీ అన్నా సిరి ధన్య' అందించే 'పోషణ్' అనే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని బిజెపి హమీ ఇచ్చింది.
ఇళ్లు లేనివారికి 10 లక్షల ఇళ్ల స్థలాలను రెవెన్యూ శాఖ ద్వారా పంపిణీ చేస్తామని కూడా బిజెపి హామీ ఇచ్చింది. కర్ణాటకను భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. 1,500 కోట్లు కేటాయిస్తామని కూడా కాషాయ పార్టీ హామీ ఇచ్చింది.
కాగా, కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి ఇచ్చిన హామీలపై రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, సాధారణ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మోడీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యాగాలు, విదేశాల నుంచి నల్ల డబ్బు తరలింపు, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల జమ వంటి హమీల మాదిరిగానే ఈ హామీలు కూడా అమలుకానీ హామీలుగానే ఉంటాయనే భావిస్తున్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్న బిజెపి తన పాలనలో వీటిల్లో కొన్ని అయినా అమలు చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.










