Apr 12,2023 11:48

నైఫిడా  :  ఓ గ్రామంపై మంగళవారం మయన్మార్‌ సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా మరణించగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయలపాలైన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. వివరాల ప్రకారం.. . మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలోని రెండవ అతిపెద్ద నగరమైన పాజిగ్గి గ్రామంలో జుంటా సైనిక పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో మంగళవారం ఓ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. . సుమారు 150 మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అదే సమయంలో సైన్యం వైమానిక దాడికి దిగింది. ఈ దాడిలో ఆందోళనకారులతో పాటు సామాన్య పౌరులు కూడా మరణించినట్లు మీడియా తెలిపింది. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నట్లు సమాచారం అందిందని.. అందుకే దాడి చేసినట్లు మయన్మార్‌ సైన్యం వెల్లడించినట్లు సమాచారం. జుంటా సైనిక వ్యతిరేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటంతో ఈ దాడికి పాల్పడినట్లు పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (పిడిఎఫ్‌) మీడియాకు తెలిపింది. అయితే ఈ దాడిలో 100 మంది దాకా మరణించి ఉంటారని పిడిఎఫ్‌ సభ్యుడు ఒకరు తెలిపారు.

మయన్మార్‌లో జుంటా సైన్యం అదుపులోకి తీసుకున్న ఆంగ్‌సాన్‌సూకీ పార్టీకి చెందిన సభ్యులు, ఇతర చట్టసభ సభ్యుల సమూహంతో కూడిన నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌ (ఎన్‌యుజి) ఈ దాడిని ఖండించింది. హేయమైన చర్యగా పేర్కొంది.

2021 ఫిబ్రవరిలో సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు వైమానిక దాడులు జరుపుతోంది. ఇప్పటివరకు భద్రతా బలగాల చేతుల్లో సుమారు 3000 మందికి పైగా మరణించినట్లు అంచనా.

దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ
ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్నవారు బాధ్యత వహించాల్సి వుందని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిచాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు ఐరాస హక్కుల అధ్యక్షుడు వోల్కర్‌ టర్క్‌ తెలిపారు. ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్న పాఠశాల విద్యార్థులపై దాడి చేపట్టడం హేయమైన చర్య అని అన్నారు.