Apr 13,2022 07:02

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వారం రోజుల పాటు కసరత్తు చేసి రూపొందించిన రెండో టీమ్‌ మీద చర్చ అందులోని సామాజిక పొందికల చుట్టూనే ఎక్కువగా తిరిగింది. పాతిక మంది మంత్రుల్లో 70 శాతం అంటే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు చెందినవారే ఉన్నారని, మహిళలకు నల్గురికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినట్లు అధికార పార్టీ చెప్పుకుంటోంది. దీంతోనే సామాజిక విప్లవం వచ్చేసినట్టు వైసిపి వ్యాఖ్యానిస్తుంటే, బిసిల డిఎన్‌ఎ తెలుగుదేశం లోనే ఉందని, ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరని ప్రతిపక్ష నేత కౌంటర్‌ ఇచ్చారు. ఈ రెండు పార్టీల ప్రచారాలు బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా పరిగణించే భావన నుంచి వచ్చినవే. కొన్ని మంత్రి పదవులను ఇచ్చినంత మాత్రాన సామాజిక విప్లవం వచ్చేస్తుందా? భూమి లేని పేదలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల్లో చాలా వరకు దళితులు, ఇతర బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. ఆర్థిక దోపిడీకి గురైనవారిలోనూ వీరే అధికం. ఏ ప్రభుత్వం వచ్చినా వీరి బతుకుల్లో ఎలాంటి మార్పు వుండడం లేదు. మంత్రివర్గంలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచడంతోనే వారి జీవితాలు సమూలంగా మారిపోతాయని నమ్మబలకడమే తప్పు. ఆయా తరగతుల ప్రజల్లో అత్యధికులు వెనుకబాటుతనానికి మూలాలను వెతికి, వాటిని అధిగమించే పరిష్కారాలు రూపొందించి అమలు చేయాలి. వ్యవసాయం, చేతివృత్తులు దెబ్బ తినడానికి కారణమైన కార్పొరేట్‌ విధానాల నుండి వైదొలగాలి. అదే అసలైన పరిష్కారం. కార్పొరేటీకరణను సమర్థించే వైసిపి, తెలుగుదేశం, బిజెపిలకు ఈ చర్చ ఇష్టం ఉండదు. అందుకే వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అవి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. ప్రజల జీవనోపాధి, దళితులు, ఆదివాసీలు, ఇతర బలహీన వర్గాలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీ వంటివి ఎజెండాపైకి వస్తే ఈ పార్టీల అసలు రంగు బయట పడుతుంది. సామాజిక న్యాయం నెరవేరాలన్నా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధించాలన్నా తక్షణం జరగాల్సింది ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో మార్పు. ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి ఒకదాని వెంట ఒకటి విరుచుకుపడడంతో చెల్లా చెదురైన ప్రజల జీవనోపాధిని పెంచే చర్యలు చేపట్టకుండా బడుగు వర్గాల ఉద్ధరణ గురించి మాట్లాడడంలో అర్థం లేదు. ప్రజలకు ఊరట కల్పించడానికి బదులు చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపు, కరెంటు చార్జీలు, యూజర్‌ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడం సామాజిక న్యాయాన్ని కోరుకునేవారు చేయాల్సిన పనేనా? రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెగబడుతుంటే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టకుండా సామాజిక న్యాయాన్ని ఎలా కాపాడతారు? లక్షలాది పోస్టులు ఖాళీగా ఉంటే, వాటి రిక్రూట్‌మెంట్‌పై నిషేధం విధించడం, కొన్ని పోస్టులను రద్దు చేయడం ఇవన్నీ సామాజిక న్యాయం కోసం చేస్తున్నవేనా? పోలవరం ప్రాజెక్టు వల్ల వేలాది గిరిజన కుటుంబాలు రోడ్డున పడితే వారికి పునరావాసం కల్పించకుండా జాప్యం చేయడం సామాజిక న్యాయమేనా? మైనార్టీలకు వ్యతిరేకంగా సిఎఎ చట్ట సవరణను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అక్కడ దానికి మద్దతు ఇస్తారు. ఇది కూడా మైనార్టీల ఉద్ధరణలో భాగమేనా? మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా తెగువను వైసిపి ప్రభుత్వం ఎందుకు చూపలేకపోతోంది? మంత్రి పదవుల మ్యూజికల్‌ చైర్స్‌ ఆట తమ అనుయాయులలో సంతృప్తికో అసంతృప్తికో కారణమవుతుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. దీనికి సామాజిక న్యాయం ముసుగు వేయడంలో అర్థం లేదు.