Jan 25,2023 22:05

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌. లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. సిఐటియు అనుబంధ యూనియన్‌ నాయకులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు బుధవారం నిరసన తెలిపి అనంతరం కమిషనర్‌ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పుట్టపర్తి నగర పంచాయతీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌ ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం రద్దు చేయాలని కోరారు. స్మార్ట్‌ ఫోన్‌ లేక, ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆపరేట్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పిఎఫ్‌ సమస్య పరిష్కరించాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శానిటేషన్‌, ఇంజనీరింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రామయ్య, పెద్దన్న, నరసింహులు, నాగార్జున, రామదాసు, రమేష్‌, గణేష్‌, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.