న్యూఢిల్లీ : ఫైజర్ వ్యాక్సిన్ మూడవ డోసుకు కూడా అనుమతించాలని సదరు వ్యాక్సిన్ సంస్థ అమెరికా డ్రగ్స్ నియంత్రణ సంస్థను కోరింది. 12 నెలల్లోపు మూడవ డోసు ఇవ్వడం వల్ల అనూహ్యంగా రోగ నిరోధక శక్తి పెరిగి, కొత్తగా పుట్టుకు వస్తున్న కరోనా మ్యుటెంట్ల నుండి రక్షణ కలుగుతుందని పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్ డోసు, ఇతర కోవిడ్-19 డోసులు ఎంతో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ నుండి కాపాడుతున్నాయని పలు దేశాల పరిశోధనలు చెబుతున్నాయి. అయితే అన్ని కోవిడ్ వ్యాక్లిన్లలో కూడా అత్యధికంగా రెండు డోసులిచ్చే వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు డోసులు కూడా డెల్టా వేరియంట్‌తో సహా అన్ని రకాల కరోనా వైరస్‌పై పోరాడేందుకు వీలుగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తున్నాయి. కాగా, యాంటీ బాడీలు సహజంగా క్షీణిస్తాయి, అదే సమjంలో బూస్టర్లు ఎప్పుడు అవసరమవుతాయో చెప్పేందుకు అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి.
దీనిపై ఫైజర్ ఎండి డా. మైఖేల్ డోల్‌స్టన్ మాట్లాడుతూ .. కంపెనీ బూస్టర్ అధ్యయనం నుండి వచ్చిన తొలి డేటాలో ప్రజల యాంటీబాడీ స్థాయిలు రెండవ మోతాదుతో పోల్చి చూస్తే...మూడవ మోతాదు తర్వాత ఐదు నుండి 10 రెట్లు పెరిగాయని వెల్లడైందని అన్నారు. ఈ నేపథ్యంలో మూడవ డోసుకు అత్యవసర వినియోగానికి ఆమోదించాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆగస్టులో కోరనున్నట్లు తెలిపారు. డెల్టా వేరియంట్‌పై ఫైజర్ తీవ్ర ప్రభావితం చూపిస్తుందని బ్రెజిల్, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటాను సూచించారు.










