Sep 28,2020 14:51

మూడు చిట్కాలు

పాఠశాలకు కొత్తగా టీచర్‌ రావడంతో.. ఆమెను పిల్లలకు పరిచయం చేశారు ప్రధానోపాధ్యాయులు.
మొదట ఆమె ఏడవ తరగతి గదిలోకి ప్రవేశించారు. 'పిల్లలూ..! ఇరవై సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో పనిచేశా. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. మీకే సందేహం ఉన్నా నన్ను అడగొచ్చు' అన్నారు టీచర్‌.
పిల్లల్లో కొంత భయం పోయింది. 'మీరుగానీ హోంవర్కు ఇస్తారేమిటి?' మొదట ప్రశ్న సంధించాడు వెనుక బెంచీలో కూర్చున్న శ్రీను అనే విద్యార్థి.
మిగతా పిల్లలంతా పెద్దగా నవ్వారు. శ్రీను చిన్నబుచ్చుకొన్నాడు.
'చదువుకి మననం అవసరం. పాఠశాలలో నేర్చుకున్న అంశాలను హోం వర్కు రూపంలో చేసుకుంటూపోతే జ్ఞాపకం ఉండిపోతాయి. పరీక్షలప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు' అని విపులంగా చెప్పారు టీచర్‌.
'టీచరు గారూ! చదివిన పాఠాలు జ్ఞాపకం ఉండాలంటే ఏమి చేయాలి?' అని అడిగాడు రాంబాబు అనే విద్యార్థి.
'ఇప్పుడా విషయం పక్కన పెట్టండి. ఎప్పుడూ చదువుగోలేనా? ఈ రోజు సరదాగా మీతో గడపాలని ఉంది' అన్నారు టీచర్‌.
'మీరెవరైనా విహారయాత్రకు వెళ్ళారా?' అడిగారు టీచర్‌.
'మా తరగతి పిల్లలమంతా కలసి అరకు వెళ్ళాం టీచర్‌!' ముక్తకంఠంతో చెప్పారు పిల్లలంతా.
'ఎవరు తీసుకు వెళ్ళారు?' అడిగారు టీచర్‌.
'డ్రిల్‌ టీచరు!' సమాధానమిచ్చారు పిల్లలు.
'ఎలా వెళ్ళారు?' అని అడిగారు మేడమ్‌.
'ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు బస్సులో, అక్కడ నుంచి ట్రైన్‌లో' ఉత్సాహంగా ఒక విద్యార్థి చెప్పాడు.
'ట్రైన్లో వెళ్తుంటే చెట్లు, పచ్చిక బయళ్ళు అందంగా కనిపించాయి. బొర్రాగుహల్లో మరో లోకంలో ఉన్నట్లే అనిపించింది. ఎంత బాగున్నాయో!. అక్కడ నుంచి లంబసింగు కూడా వెళ్లాము' అంటూ తన ఆనందాన్ని బయటపెట్టాడు మరో విద్యార్థి.
'చాలా విషయాలు చెప్పారు. ఇన్ని విషయాలు ఎలా గుర్తున్నాయి?' ప్రశ్నించారు మేడమ్‌.
'విహారయాత్రకి వెళ్ళి వచ్చాక కొన్నిరోజుల పాటు ఆ విషయాలనే మాట్లాడుకున్నాం' ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు.
'ఆ ట్రిప్‌ మీకు అంతగా నచ్చిందన్న మాట' అన్నారు టీచర్‌.
'నచ్చడమేమిటి? అరకంటే మాకెంతో ఇష్టం కూడా' అన్నాడు ఒక విద్యార్థి.
'చూశారా పిల్లలూ..! ఏ విషయాన్నైనా జ్ఞాపకం ఎలా ఉంచుకోవాలో మీరే చిట్కాలు చెప్పారు' అన్నారు టీచర్‌.
'మేమేమి చిట్కాలు చెప్పాం!?' ఆశ్చర్యపోతూ అడిగారు పిల్లలు.
'ఎన్నుకున్న విషయంపై ఇష్టం పెంచుకోవాలి. అనుభూతితో ఆస్వాదించాలి. పదే పదే మననం చేసుకోవాలి. ఈ మూడు చిట్కాలు మీరు చెప్పినవేగా' విడమరిచి చెప్పారు టీచర్‌.
అప్పుడు పిల్లలకు అర్థమైంది. తమకు తెలిసిన ఈ చిట్కాలు ఆచరణలో పెడితే చదువులో బాగా రాణించవచ్చని.
'ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీరందరూ చదువులో నెంబర్‌ వన్‌గా నిలుస్తారు!' అని టీచర్‌ చెప్పడంతో ఆనందంగా వికసించాయి ఆ పిల్లల ముఖాలు.
- బి. వి. పట్నాయక్‌
9441349275