ప్రజాశక్తి - రొద్దం : సర్పంచులకు నిధుల మంజూరు, పంచాయతీలో పనుల నిర్వహణలో ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఓ సర్పంచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కంబాలపల్లి సర్పంచి మంజునాథ్ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి సర్పంచులు తమకు రావాల్సిన 14,15, ఫైనాన్షియల్ నిధుల విషయంలో నిరసన వ్యక్తం చేశారు. సమావేశాన్నిబారు కట్ చేసి బయటికి వెళ్లారు. దీంతో ఎంపీపీ చంద్రశేఖర్, మండల అధికారులు వారితో మాట్లాడారు. రెండో విడత అధిక మొత్తంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని దీంతో పంచాయతీలలో నెలకొన్న సమస్యలు తీరుతాయని అధికారులు నచ్చజెప్పారు. దీంతో సర్పంచులు సమావేశానికి హాజరయ్యారు. ఉపాధి పనులపై చర్చ జరుగుతున్న సందర్భగా తమ పంచాయతీలో ఉపాధి పనులు జరపడం లేదంటూ సమావేశం మధ్యలోనే కంబాలపల్లి సర్పంచి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎంపిపి ఉపాధి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడీవేడిగా ఒక పక్క సమావేశం జరుగుతుండగా పలువురు పంచాయతీ కార్యదర్శులు సెల్‌ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.










