న్యూఢిల్లీ : మండీలను అంతం చేయడమే నల్ల చట్టాలను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని పార్లమెంటులో గురువారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రెండు నెలలుపైగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కేవలం నలుగురు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అంతకు ముందు ట్వీట్ చేశారు. ''హమ్‌దో.. హమారా దో సర్కార్ (మేమిద్దరం... మావాళ్లిద్దరి ప్రభుత్వం )'' అంటూ ట్వీట్ చేశారు. మీరంతా ఇది రైతుల ఉద్యమమని భావిస్తున్నారని.. కానీ ఇది రైతుల ఉద్యమం కాదని.. ఇది భారతదేశ ఉద్యమమని.. రైతులు దారి మాత్రమే చూపుతున్నారని అన్నారు. బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపి పి. చిదంబరం మాట్లాడుతూ..మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. ధనికుల కోసం రూపొందించారని, ధనికుల కోసమని, ధనికులకేనని అన్నారు. పేద, వలస కార్మికుల కోసం కేంద్రం ఏమీ చేయలేదని అన్నారు.










