వాషింగ్టన్ : మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం అమెజాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శుక్రవారం విక్రయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ షాపింగ్‌లో ఏడాది మొత్తంలో అత్యధికంగా సేల్స్ జరిగేవి శుక్రవారాలే కావడం గమనార్హం. దీంతో 'మేక్ అమెజాన్ పే' పేరుతో అమెరికా, బ్రిటన్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్‌లతో కలిపి మొత్తం 40 దేశాలకు చెందిన ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా మెరుగైన వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెజాన్‌లోని ఆమోదయోగ్యం కాని, అసురక్షిత పనిపరిస్థితులను వెంటనే నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ జనరల్ సెక్రటరీ క్రిస్టీ హాఫ్మాన్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు మెరుగైన ఉద్యోగుల కోసం కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు.
ఫ్రాన్స్, జర్మనీ యూనియన్స్ సిజిటి, వెర్.డి లతో పాటు యూరప్ మార్కెట్లోని 18 మేజర్ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కార్మికుల ఉత్పాదకతను కంప్యూటర్ల ద్వారా పరిశీలించే విధానం గురించి కార్మికులు ఆందోళన చెందుతున్నారని జర్మనీలోని వెర్.డి అమెజాన్ కమిటీ అధ్యక్షురాలు మోనికా డి సిల్వెస్ట్రే ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు వారు గంటకు ఎన్ని ప్యాకింగులు చేయగలరు (యాంత్రిక పద్ధతి) విధానంతో వారిపై ఒత్తిడి అధికమవుతుందని అన్నారు. ఈ ప్రదర్శనకు అంతర్జాతీయ కార్మిక సంఘాల సహకారంతో పాటు పర్యావరణం, సామాజిక సంస్థలు మద్దతు ప్రకటించనున్నాయి.










