చండీగఢ్ : బ్రిటీషర్ల తరహాలో మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొడతారని మాజీ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు విజేత మహవీర్ ఫోగట్ మండిపడ్డారు. హర్యానాలోని తన స్వగ్రామం బలైలో గురువారం మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ.. దేశ కుమార్తెల బాధను రైతు నేతలు అర్ధం చేసుకున్నారని, దేశం మొత్తం ఇప్పుడు కలిసికట్టుగా రెజ్లర్ల పక్షాన నిలబడిందని అన్నారు. వారి ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకున్నదని చెప్పారు. ఖాప్ పంచాయతీల నుంచి సామాజిక, రైతు సంఘాల వరకూ దేశ ప్రజలు భారీ ఉద్యమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. బలై గ్రామానికి పేరుతెచ్చిన ఫోగట్ సిస్టర్స్‌కు సంఘీభావంగా, మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు పంచాయత్ నిర్వహించాలని నిర్ణయించారు.
తాను అన్నీ పణంగా పెట్టి తన కుమార్తెలు పతకాలు సాధించే దిశగా తీర్చిదిద్దానని, కానీ ఇప్పుడు వారి పరిస్ధితి దయనీయంగా ఉందని మహవీర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెజ్లర్లు వారి మెడల్స్‌ను గంగా నదిలో విసిరివేయాలని నిర్ణయం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో దేశ ప్రజలు బ్రిటీష్ వారిని తరిమికొట్టినట్టు ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. క్రీడాకారిణులు రెజ్లింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్ధితులు ఉన్నాయని, జూనియర్ల భవితవ్యం అభ్రదతతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. మహిళా రెజ్లర్ల పరిస్ధితి చూడలేకపోతున్నామని, ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు.










