* వికలాంగులకూ వేరే విధులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఒక్కసారిగా సాధారణ విధుల నుంచి యూనిఫాం విధుల్లోకి చేరేందుకు ఇబ్బందులు పడుతున్న మహిళా పోలీసులకు కొత్త ఆప్షన్ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. రెరడేళ్ల క్రితం జరిపిన గ్రామ, వార్డు సచివాయాల కార్యదర్శుల భర్తీ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శులుగా అనేక మందిని నియమించారు. వారందరినీ మహిళా పోలీస్‌గా మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సాధారణ విధులకు ఎంపికైన వీరంతా ఇప్పుడు యూనిఫాం ధరించి ఇతర పోలీసుల మాదిరిగా విధులు నిర్వహించేందుకు వారి శరీర దారుఢ్యం, ఇతర అంశాలు ఆటంకంగా భావిస్తున్న కొందరు ఉద్యోగులు అధికారుల వద్ద తమ గోడును వినిపించుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించేవారితోపాటు క్లరికల్ పోస్టుల్లో, స్టేషన్ లేదా కార్యాలయాల్లో ఉంటూ పనిచేసే పోస్టుల్లో తమను నియమించాలన్న వినతులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీటి సాధ్యాసాధ్యాలను పోలీసు ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తాజాగా ఒక ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యూనిఫాం విధులు నిర్వహించలేని వారు, అంగవైకల్యంతో ఉన్న వారు క్లరికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునంటూ ప్రాథమికంగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి నిర్ణయం లేదని కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. డిజిపి కార్యాలయ స్థాయిలో ఈ ఆలోచన చేసినా, ఇంతవరకు తమ దృష్టికి రాలేదని హోం శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.










