ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్‌గా చిటికెన వెంకటేశ్వరమ్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ అభ్యర్థిగా 43వ డివిజన్ కార్పొరేటర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పేరును పూర్వపు మేయర్, 23వ డివిజన్ కార్పొరేటర్ మోకా వెంకటేశ్వరమ్మ ప్రతిపాదించారు. 12వ డివిజన్ కార్పొరేటర్, పూర్వపు డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత బలపరిచారు. సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో రెండో మేయర్‌గా చిటికెన వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ కె.రాజాబాబు ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మేయర్‌కు ఆయన పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ముందుగా ఊరేగింపు ఆమె ఊరేగింపుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు, వైసిపి కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొని నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ పదవిని హోదాగా, అధికారంగా భావించక, ప్రజలకు సేవ చేసేందుకు ఒక సదవకాశంగా భావించాలని సూచించారు. మేయర్ గా మంచి పాలనతో మచిలీపట్నం నగరపాలక సంస్థ చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. మొదటి మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ గత పాలనతో పోటీ పడి పని చేసి ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ బొర్రా నాగ వెంకట దుర్గా భవాని విఠల్, పూర్వపు డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, ప్రస్తుత డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా (ఆచ్ఛాబా), వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జి చంద్రయ్య, యువ నాయకుడు పేర్ని కష్ణమూర్తి (కిట్టూ), జనసేన పార్టీ 4వ డివిజన్ కార్పొరేటర్, వినిశెట్టి ఛాయాదేవి, పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.










