చిరుత పిల్ల టోని, నక్కపిల్ల జిత్తు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువు కుంటున్నారు. ప్రతిరోజూ సాయంకాలం ఇద్దరూ తమ స్నేహితులతో ఆడుకునేవారు. ఒకరోజు జిత్తు వాళ్ళ నాన్న సెల్‌ఫోన్ కొన్నాడు. దాంతో జిత్తు స్నేహితులతో ఆడటం పూర్తిగా మానేశాడు. సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. ఒకసారి జిత్తు వాళ్ళ నాన్న పనిమీద పొరుగూరికి వెళ్లాడు. ఆయన తనతో పాటు సెల్‌ఫోన్ కూడా తీసుకు వెళ్ళాడు. వీడియో గేమ్స్ ఆడటానికి ఫోన్ అందుబాటులో లేక జిత్తు మరలా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లాడు. కానీ జిత్తు తనకు దగ్గరగా ఉన్న స్నేహితులను గుర్తించగలిగాడు. దూరంగా ఉన్నవారిని సరిగా గుర్తించలేకపోయాడు. ఊరు నుంచి తిరిగొచ్చిన జిత్తు నాన్న దగ్గరకు జిత్తు స్నేహితులు వెళ్లారు. 'అంకుల్ జిత్తుకు కళ్లు మసకమసకగా కనిపిస్తున్నాయి' అని చెప్పారు. దాంతో ఆయన జిత్తుని దగ్గరలో ఉన్న గుడ్లగూబ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ ఆసుపత్రి ఒక మర్రిచెట్టు కింద ఉంది. జిత్తు వాళ్లు వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది వరుసలో నిలబడి ఉన్నారు. గంట తర్వాత వీరి వంతు వచ్చింది. జిత్తు వాళ్ళ నాన్న డాక్టర్‌కు విషయమంతా చెప్పాడు. అప్పుడు డాక్టర్ రావి చెట్టు కొమ్మకు కట్టేసి ఉన్న అక్షరాలు ఉన్న బోర్డ్ చూపించి, అందులోని అక్షరాలను చదవమని చెప్పాడు.
జిత్తు ఆ అక్షరాల్లో కొన్నింటిని మాత్రమే చదవగలిగాడు. ఎన్నో అక్షరాలను చదవలేకపోయాడు. డాక్టర్ బరువు చూపే మిషన్ పైన నిల్చోబెట్టి జిత్తు బరువెంత ఉన్నాడో కొలిచాడు. తర్వాత జిత్తు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ''పోయినసారి మీరు జ్వరం అని వచ్చినప్పుడు, జిత్తు చాలా దృఢంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి ఇలా మారిపోయాడు? బరువు పెరిగాడు కూడా! పైగా చూపు మందగించింది. శారీరకంగా బలహీనంగా ఉన్నాడు'' అని చెప్పాడు. అప్పుడు జిత్తు వాళ్ళ నాన్న మాట్లాడుతూ ''ఎప్పటిలానే స్కూలుకి వెళ్లి వస్తున్నాడు. కానీ సాయంకాలం స్నేహితులతో ఆడుకోవడం లేదు. నా సెల్‌లో గేమ్స్ ఆడుకుంటున్నాడు'' అన్నాడు. అప్పుడు డాక్టర్ మాట్లాడుతూ ''ఈ సమస్యలన్నీ సెల్ వల్లే వచ్చాయి. చూపు మందగించింది దానివల్లనే! అలాగే శరీరం దృఢంగా లేకపోవడం కూడా దాని వల్లనే! ఎక్కువసేపు కదలకుండా ఉంటూ గేమ్స్ ఆడటంతో బరువు పెరిగిపోయాడు'' అని చెప్పాడు. తర్వాత కళ్లద్దాలతో పాటు కొన్ని మందులు కూడా రాసిచ్చాడు. సెల్‌లో ఆటలు ఆడటం మానేసి, ఎంచక్కా స్నేహితులతో ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కొన్ని రోజుల్లోనే కళ్లద్దాల అవసరం కూడా ఉండకపోవచ్చు అని చెప్పారు డాక్టర్.
జిత్తు, వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చారు. సెల్‌లో తదేకంగా చూస్తూ గేమ్స్ ఆడినందువల్ల తన ఆరోగ్యం చెడిపోయిందని జిత్తు గుర్తించాడు. ఇంకా స్నేహితులతో ఆటలకు వెళ్లకుండా వారిని దూరం చేసుకున్నానని బాధపడ్డాడు. ఇక మీదట నాన్న ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సాయంకాలాలు పాతరోజుల్లాగానే మిత్రులతో ఆటలు ఆడడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యంగా కొద్దిరోజుల్లోనే జిత్తు చూపు మెరుగైంది.
- శాఖమూరి వివేక్,
7 వ తరగతి,
యర్రగొండపాలెం,
ప్రకాశం జిల్లా .