ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ బాధితులకు భరోసా ఇచ్చే క్యూబా వైద్య బృందానికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం సమంజసంగా ఉంటుంది. నిజానికి ఈ అవార్డుకు క్యూబా వైద్యులను ఎంపిక చేస్తే అది ఆ అవార్డుకే వన్నె తెస్తుంది. క్యూబాను గౌరవించడమంటే ప్రపంచం తనను తాను గౌరవించుకోవడమే. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో ఇరవై ఏడు దేశాలకు అండగా నిలిచి, విశేషంగా సేవలందిస్తున్న 'హెన్రీ రీవ్ అంతర్జాతీయ మెడికల్ బ్రిగేడ్' పేరును నోబెల్ శాంతి బహుమతికి క్యూబా లిండా అనే ఫ్రెంచ్ అసోసియేషన్ ఏప్రిల్ 28న ప్రతిపాదించింది. దీనికి మద్దతు తెలపాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి అది ఇచ్చిన పిలుపునకు అన్ని వైపుల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు, ప్రగతిశీల శక్తులు, మేధావులు, ప్రముఖులు, సంస్థలు ఈ ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కేది మరో మూడు రోజుల్లో తేలనుంది.
ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అసాధారణమైనదిగా పేర్కొనబడుతున్న కోవిడ్-19 మహమ్మారి బారి నుంచి వేలాది మంది ప్రజలను కాపాడి, వారిలో ఉత్తేజాన్ని, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని నింపడంలో క్యూబా వైద్యులు చేసిన కృషి అనిర్వచనీయమైనది. నిస్వార్థానికి, త్యాగ నిరతికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు మారు పేరైన హెన్రీ రీవ్ మెడికల్ బ్రిగేడ్ అంతర్జాతీయ ఆరోగ్య సంఘీభావానికి ప్రతీకగా నిలిచింది. 1959 జనవరి 1న క్యూబా విప్లవం విజయవంతమైనప్పటి నుంచే ఇతర దేశాలకు వైద్య సహాయం అందించే బాధ్యతను అది స్వీకరించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు వేలాది మంది క్యూబన్ వైద్యులను పంపింది. భూకంపాలు, తుపానులు, భారీ వర్షాలు, అంటువ్యాధులు వంటి విపత్తులు ఎక్కడ చోటుచేసుకున్నా క్యూబా మెడికల్ బ్రిగేడ్ అక్కడ ప్రత్యక్షమవుతూ వస్తోంది. పాకిస్తాన్, ఇండొనేషియా, చిలీ, ఈక్వెడార్ వెనిజులా, బొలీవియా, హైతీ న్యూ ఆర్టీన్స్, సియెర్రా లియోన్, లైబీరియా వంటి దేశాల్లో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడింది. వైద్య సేవలందించడమే కాదు, వందకు పైగా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలకు క్యూబా వైద్యులు శిక్షణ ఇచ్చారు. పశ్చిమాఫ్రికాలో భయంకరమైన అంటువ్యాధి ఎబోలా విజృంభించినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడడంలో క్యూబా వైద్య బృందం చేసిన కృషికి గుర్తింపుగా డబ్ల్యుహెచ్‌ఓ 2017లో ప్రతిష్టాత్మక లీ జోగ్ వుక్ స్మారక పురస్కారంతో సత్కరించింది. అమెరికా కక్షగట్టి ఆరు దశాబ్దాలుగా ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనంతో ఇబ్బంది పెడుతున్నా, వాటన్నిటిని అధిగమించి క్యూబా అంతర్జాతీయ ఆరోగ్య సంఘీభావాన్ని కొనసాగిస్తున్నది. అమెరికా ప్రపంచానికి బాంబులు ఎగుమతి చేస్తుంటే, దానికి పూర్తి భిన్నంగా వైద్యులను, నర్సులను క్యూబా పంపిస్తున్నది. అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ మానవాళికి సవాల్ విసిరిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పెట్టుబడిదారీ దేశాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతను గాలికొదిలేసి కరోనా కాలంలో సైతం కార్పొరేట్ల లాభార్జనకే ఈ దేశాలు పరిమితమయ్యాయి. దాంతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి.
దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి సోషలిస్టు దేశాలలో ఉంది. సోషలిస్టు దేశాలు సామాజిక బాధ్యతకు అధిక ప్రాధాన్యమిస్తాయి. అక్కడ ప్రజారోగ్యం ఒక హక్కు. కరోనా వైరస్ మొదటిసారి వుహాన్‌లో తలెత్తినప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవాలో అంతగా తెలియని ఆ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు పాకకుండా చైనా ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా కట్టడి చేయడమే గాక, ప్రాణ నస్టాన్ని కూడా చాలావరకు కట్టడి చేయగలిగింది. అ ఆనుభవంతో అల్జీరియా, బుర్కినాఫాసో, సూడాన్, వెనిజులా వంటి దేశాలకు వైద్య పరికరాలు, మాస్కులు, ఓడల నిండా మందులను, వైద్య నిపుణులను పంపింది. కరోనాపై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి తోడ్పాటునందించింది. అమెరికా ఈ విషయంలో విధ్వంసకర పాత్ర పోషించింది. వైరస్‌ను బారి నుంచి తమ ప్రజలను కాపాడడం మానేసి చైనా, డబ్ల్యుహెచ్‌లకు వ్యతిరేకంగా ట్రంప్ అబద్ధపు ప్రచారం సాగించారు. ట్రంప్ నిర్లక్ష్యానికి అమెరికన్ ప్రజలు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే రెండు లక్షలకుపైగా అమెరికన్లు కరోనాకు బలయ్యారు. అధ్యక్షుడితో సహా 73 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. యూరపు లోని పెట్టుబడిదారీ దేశాల పరిస్థితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. ఇటలీపై కరోనా మహమ్మారి పెద్దయెత్తున విరుచుకుపడితే యూరోపియన్ యూనియన్‌లోని ఏ ఒక్క దేశం కూడా దానికి సహకారం అందించడానికి ముందుకు రాలేదు. ఎక్కడో ఉన్న క్యూబా వచ్చి ఆ దేశాన్ని ఆదుకుంది. కరోనాపై పోరులో అంతర్జాతీయ సంఘీభావానికి, ప్రజల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన క్యూబా వైద్య బృందం నూటికి నూరు పాళ్లు నోబెల్ శాంతి పురస్కారానికి అర్హురాలు. స్వీడిష్ నోబెల్ కమిటీ ఈ వాస్తవాన్ని గుర్తెరిగి వ్యవహరిస్తుందనే ఆశిద్దాం.










