అనంతపురం : రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో సిఎం జగన్‌మోహన్ రెడ్డి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణతో నీటి వివాదాలపై స్పందించారు.
''తెలంగాణతో జల వివాదాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే, టిడిపి అధినేత చంద్రబాబు ఓ నాలుగైదు రోజులు ఈ అంశంపై మౌనంగా ఉండి, ఇప్పుడిప్పుడే దీనిపై మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా తాను చంద్రబాబుకు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. దశాబ్దాల తరబడి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ.. ఈ మూడూ కలిసిందే ఆంధ్ర రాష్ట్రం. కృష్ణా నదీ జలాలు కోస్తాంధ్రకు ఎంత? తెలంగాణకు ఎంత? రాయలసీమకు ఎంత? అనే విభజన ప్రకారమే మొదటి నుంచి కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. ఎపి, తెలంగాణ విడిపోయాక 2015 జూన్ 19న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ నీటి కేటాయింపులపై సంతకాలు చేసింది. దీని ప్రకారం.. రాయలసీమకు 144 టిఎంసిలు, కోస్తాకు 367 టిఎంసిలు, తెలంగాణకు 298 టిఎంసిలు కేటాయించారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి రావాలంటే నీటిమట్టం 881 అడుగులకు చేరాలి. లేకపోతే పూర్తిస్థాయిలో నీళ్లు రావు. శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం 885 అడుగులు. నేను సిఎం అయ్యాక ఈ రెండేళ్లు వర్షాలు బాగా పడ్డాయి. అంతకుముందు 20 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్‌లో 881 అడుగుల పైచిలుకు నీటిమట్టం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి సామర్థ్యం పెంచి నీటిని వాడుకుంటున్నారు. వాటన్నింటి నుంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. 796 అడుగుల్లోపే విద్యుదుత్పాదన చేసే సౌకర్యం ఉంది. 800 అడుగుల లోపే మీకు కేటాయించిన నీరు వాడుకున్నప్పుడు.. మేము 881 అడుగులకు నీటిమట్టం చేరుకుంటే తప్ప వాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మేం రాయలసీమ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే తప్పేంటి? మాకు హక్కుగా కేటాయించిన నీటినే మేం వాడుకుంటుంటే మీకు అభ్యంతరం ఏంటి? చంద్రబాబుకు ఇంకాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా. గతంలో ఎపి సిఎంగా నువ్వు ఉన్నప్పుడు సిఎం కెసిఆర్ పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంటే నువ్వేం గాడిదలు కాస్తున్నావు చంద్రబాబూ?
మా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకుంటోంది ఎవరి వాటా నీళ్లు తీసుకోవడానికి కాదు. రైతులకు ఉపయోగపడే నీళ్ల విషయంలో రాజకీయాలు జరగడం బాధాకరం. అయితే, మేం ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతోనూ విభేదాలు కోరుకోవడం లేదు. మేం పాలకుల మధ్య సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నాం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పక్క రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టబోను. రాబోయే రోజుల్లోనే నా వైఖరి ఇలాగే ఉంటుంది. అందరితోనూ మంచినే కోరుకుంటున్నా'' అని సిఎం జగన్ ఉద్ఘాటించారు.










