తమకు నచ్చిన, తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం హిందూ యువతులకు చేతకాదని, వారు తెలివితక్కువ వారని, వారికి పెళ్ళి విషయంలో స్వతంత్రత ఇవ్వకూడదని హిందూత్వ శక్తులు భావిస్తున్నాయన్నమాట. 'స్త్రీ కి స్వాతంత్య్రం ఉండకూడదు' అని మను ధర్మశాస్త్రంలో చెప్పినదే బిజెపి ఇప్పుడు చట్టం రూపంలో అమలు చేయడానికి పూనుకుంటోంది. దానిని సమర్ధించు కోడానికి తాము హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే ఇదంతా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. అందుకోసం కట్టుకథను అల్లింది. దాని పేరే 'లవ్ జిహాద్'.
వివాహం కోసం మతం మార్చుకోవడం ఒక నేరంగా చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 24న ఒక ఆర్డినెన్సు తెచ్చింది. 'చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ ఆర్డినెన్సు-2020' అన్నది దాని పేరు. బిజెపి పాలిత రాష్ట్రాలు హర్యానా, మధ్యప్రదేశ్, అసోం, కర్నాటక కూడా అటువంటి చట్టాలను తీసుకురానున్నట్టు ప్రకటించాయి.
మన రాజ్యాంగం ప్రతీ పౌరునికీ మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గ్యారంటీ చేసింది. ఏ భారతీయుడైనా తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. ఏ మతాన్నీ అనుసరించకుండా కూడా ఉండవచ్చు. ఒక మతం నుండి ఇంకొక మతం లోకి మారవచ్చు. రాజ్యాంగ నిర్మాత డా||బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా హిందూ మతం నుండి బౌద్ధ మతం లోకి మారాడు, తనతోబాటు వేలాది మంది ఇతరులు కూడా మారారు. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. కొత్త మతాలు వస్తూనే ఉన్నాయి. పౌరుల మత స్వేచ్ఛను గ్యారంటీ చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాని బిజెపి అధికారం లోకి వచ్చాక పౌరుల మత స్వేచ్ఛను కాపాడడం మాట అటుంచి ఆ స్వేచ్ఛ పైనే నేరుగా దాడి చేస్తోంది. అందులో భాగమే ప్రస్తుతం బిజెపి-పాలిత రాష్ట్రాలలో తెస్తున్న చట్టాలు. వివాహం సందర్భంగా మతం మార్చుకోవడాన్ని నేరంగా పరిగణించడం అంటే అటు నచ్చిన వ్యక్తిని వివాహమాడే స్వేచ్ఛనూ హరించడం అవుతుంది, ఇటు మత స్వేచ్ఛనూ హరించడం అవుతుంది. కాని బిజెపి అన్ని మతాల పౌరుల మత స్వేచ్ఛనూ హరించేందుకే తయారైంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం.
తమ చర్యను సమర్ధించుకోవడం కోసం బిజెపి-హిందూత్వ శక్తులు ముందుకు తెచ్చిన కట్టు కథ 'లవ్ జిహాద్'. ఈ దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చివేసేందుకు ఓ పెద్ద కుట్ర జరుగుతోందని, ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రలోభ పెట్టి వివాహం చేసుకుని ముస్లిం జనాభా పెరగడానికి, హిందువులను మైనారిటీలుగా కుదించి వేయడానికి పథకం రూపొందించి అమలు చేస్తున్నారన్నది ఆ కట్టుకథ సారాంశం. అంటే తమకు నచ్చిన, తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం హిందూ యువతులకు చేతకాదని, వారు తెలివితక్కువ వారని, వారికి పెళ్ళి విషయంలో స్వతంత్రత ఇవ్వకూడదని హిందూత్వ శక్తులు భావిస్తున్నాయన్నమాట. 'స్త్రీ కి స్వాతంత్య్రం ఉండకూడదు' అని మను ధర్మశాస్త్రంలో చెప్పినదే బిజెపి ఇప్పుడు చట్టం రూపంలో అమలు చేయడానికి పూనుకుంటోంది. దానిని సమర్ధించుకోడానికి తాము హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే ఇదంతా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. అందుకోసం కట్టుకథను అల్లింది. దాని పేరే 'లవ్ జిహాద్'.
అలహాబాద్ హైకోర్టు నవంబరు 11న ఒక తీర్పునిస్తూ మత మార్పిడి జరిగిందన్న పేరుతో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాహంలో జోక్యం చేసుకోవడం ఆ ఇద్దరు వ్యక్తుల స్వేచ్ఛనూ హరించడమే అవుతుందని చెప్పి వారిపై పెట్టిన కేసును కొట్టివేసింది. నవంబరు 2017లో సుప్రీం కోర్టు కూడా హదియా అనే మహిళ షహీన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్ళి చేసుకుని మతం మారిన కేసును విచారించింది. హదియా తండ్రి తన కుమార్తెను బలవంతంగా మతం మార్పించారని కేసు పెట్టాడు. ఆ ఆరోపణను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇద్దరు వ్యక్తుల నడుమ ఏర్పడిన వ్యక్తిగత సంబంధం వివాహం. అందులో సమాజపు చట్టం జోక్యం చేసుకోవడం అంటే ఆ వ్యక్తుల స్వేచ్ఛకు అంతరాయం కలిగించడమేనని సుప్రీం కోర్టు ఆ సందర్భంగా చెప్పింది. ఇటువంటి తీర్పులు ఇంకా కూడా ఉన్నాయి. అయినా బిజెపి కి న్యాయస్థానాల తీర్పులంటే లెక్క లేదు.
మతాంతర వివాహాలతో హిందువులు ఈ దేశంలో మైనారిటీలో పడిపోతారన్న హిందూత్వ శక్తుల వాదనలో నిజం ఎంత? గత పదేళ్ళలో 170 లవ్ జిహాద్ కేసులు వచ్చాయని, ఇప్పటికి 20,000 మంది యువతులు ఈ కుట్రకు బలయ్యారని ఓ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ఇటీవల అన్నాడు. 20,000 మంది యువతులు బలైతే 170 కేసులు రావడం ఏమిటి? ఆ కథనం విశ్వసనీయత అలా ఉంది.
అదలా ఉంచుదాం. జనాభా లెక్కలు ఏం చెప్తున్నాయి? 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 80.5 శాతం (82.7 కోట్లు), ముస్లింలు 13.4 శాతం (13.8 కోట్లు), క్రైస్తవులు 2.3 శాతం (2.4 కోట్లు), సిక్కులు 1.9 శాతం (1.9 కోట్లు), బౌద్ధులు 0.8 శాతం (80 లక్షలు), జైనులు 0.4 శాతం (40 లక్షలు) ఉన్నారు. అదే 2011 జనాభా లెక్కలు చూస్తే హిందువులు 79.8 శాతం (96.63 కోట్లు), ముస్లింలు 14.2 శాతం (17.22 కోట్లు), క్రైస్తవులు 2.3 శాతం (2.78 కోట్లు), సిక్కులు 1.7 శాతం (2.08 కోట్లు) ఉన్నారు. అంటే అన్ని మతాల ప్రజల జనాభాలూ పెరిగాయి. ముస్లిం జనాభా శాతం 10 సంవత్సరాలలో 0.8 శాతం పెరిగింది. హిందూత్వ శక్తుల లెక్క ప్రకారం 'లవ్ జిహాద్' ద్వారా ఈ దేశంలో హిందువులు మైనారిటీగా మారాలంటే కనీసం 400 సంవత్సరాలు పడుతుంది !
మొత్తం జనాభాలో హిందువుల జనాభా 2001 నుంచి 2011 మధ్య కాలంలో 13 కోట్ల 93 లక్షలు పెరిగింది. కాని మొత్తం దేశ జనాభాలో హిందువుల శాతం 80.5 నుండి 79.8 కి తగ్గింది. ఎందుకిలా జరిగింది? హిందువులలో స్త్రీ-పురుష నిష్పత్తి 2001 నాటికి 931:1000 గా ఉంది. అదే ముస్లింలలో 936:1000 గా ఉంది. ఆ తర్వాత కాలంలో గడిచిన 20 సంవత్సరాలలో భ్రూణ హత్యలు మరింత పెరిగాయే తప్ప తగ్గింది లేదు. సంతానాన్ని కనేది స్త్రీలు. వారి నిష్పత్తి ఎంత తగ్గితే జనాభా పెరుగుదల అంత తగ్గుతుంది. హిందువులు అత్యధికంగా ఉన్న హర్యానాలో స్త్రీ, పురుష నిష్పత్తి 860: 1000గా ఉంది. అదే ముస్లిములు, క్రైస్తవులు దాదాపు 46 శాతం ఉన్న కేరళలో ఈ నిష్పత్తి 1058:1000 గా ఉంది. అందుచేత హిందూ జనాభా శాతం ఏమైనా తగ్గిందీ అంటే అందుకు సమాజంలో కరుడుగట్టి ఉన్న పురుషాధిక్యత, దాని పర్యవసానంగా ఆడపిల్లలను కంటే చిన్నచూపుగా పరిగణించడం, భ్రూణ హత్యలకు పాల్పడడం వంటి దురాచారాలు కారణం తప్ప మతాంతర వివాహాలు కారణం కానే కాదు. ఈ వాస్తవాలను కప్పి పుచ్చి ఏదో సాకుతో విద్వేషాలను రెచ్చగొట్టడమే హిందూత్వ శక్తుల అసలు ఎజెండా.
వివాహాలలో అనుచిత, బాహ్య జోక్యాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకు రావలసిన అవసరం ఉందని 2013లో 242వ లా కమిషన్ నివేదిక సిఫార్సు చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు జరిగితే కుల పెద్దలు, మత పెద్దలు అనుచితంగా జోక్యం చేసుకుని కులగౌరవాన్ని, మత పవిత్రతను కాపాడే పేరుతో 'గౌరవ హత్యలకు' పాల్పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లా కమిషన్ ఈ సిఫార్సు చేసింది. దానిని అనుసరించి యుపిఎ ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. దానిపై రాష్ట్రాల అభిప్రాయాలనూ కోరింది. 21 రాష్ట్రాలు, దానికి అనుకూలంగా స్పందించినట్టు ఒక గౌరవహత్య కేసు విచారణ సందర్భంలో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ గౌరవ హత్యలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాలలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు ఉన్నాయి. సమాజంలో మతాచారాల పట్టింపు, కులతత్వం ఎక్కువగా ఉండడం ఈ గౌరవ హత్యల వెనుక ముఖ్య కారణం. పురుషాధిక్యత దీనికి తోడైంది. ఇటువంటి దురాచారాల నుండి, సమాజాన్ని సంస్కరించే కార్యాచరణ చేపట్టడం ఏ నాగరిక ప్రభుత్వానికైనా ఒక ముఖ్య బాధ్యత అవుతుంది.
హిందూత్వ శక్తులు సమాజం లోని దురాచారాలను, కుల తత్వాన్ని, మత ఛాందసత్వాన్ని, పురుషాధిక్యతను తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటాయే తప్ప వాటిని నిర్మూలించే పని చేయవు. పైగా అటువంటి తిరోగమన భావజాలం తమ ఆదర్శంగా చెప్పుకుంటాయి. మనుధర్మ శాస్త్రాన్ని ఆదర్శ రాజ్యాంగంగా అభివర్ణించిన గోల్వాల్కర్, హెగ్డెవార్‌ల శిష్యుల రాజ్యం ఇప్పుడు నడుస్తోంది. ఇందులో ప్రజాస్వామ్యానికి గాని, వ్యక్తిగత స్వేచ్ఛకు గాని స్త్రీ-పురుష సమానత్వానికి గాని, సున్నితమైన, ఉదాత్తమైన మానవతకు గాని తావు లేదు. అవన్నీ మనకు కావాలంటే ఈ అనాగరిక, ఆటవిక భావజాలానికి వ్యతిరేకంగా, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే.
ఎం.వి.ఎస్.శర్మ










