జైపూర్ : లవ్‌జిహాద్ అంటూ రచ్చ చేస్తోన్న బిజెపిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మండిపడ్డారు. మత విద్వేషాలను, జాతిని విడగొట్టేందుకు ఈ పదాన్ని కేంద్రం సృష్టించిందని విమర్శించారు. హిందు మహిళను ముస్లిం యువకులు వివాహం చేసుకోవడాన్ని లేదా ఏదైనా సంబంధాన్ని కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తూ..బిజెపికి చెందిన రాష్ట్రాలు చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, వివాహం విషయంలో భాగస్వామ్యులను ఎంచుకునే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తుందని ట్వీట్ చేశారు. లవ్ జిహాదీ అన్న పదాన్ని పురుడు పోసింది బిజెపినేనని విమర్శించారు. వివాహమన్నది పూర్తిగా వ్యక్తిగతమని, అటువంటి స్వేచ్ఛను కాలరాసేందుకు ఇటువంటి చట్టాలు తీసుకురావడం చట్ట విరుద్ధమని, ఏ కోర్టులో నిలబడదని, ప్రేమలో జిహాద్‌కు చోటు లేదంటూ పేర్కొన్నారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పిలుపునివ్వడం మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, సామాజిక సంఘర్షణలకు ఆజ్యం పోసేందుకు, రాజ్యాంగ నిబంధనలను కాలరాసేందుకేనని విమర్శించారు.










