Feb 04,2023 14:53

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దళితులపై దాడులు చేస్తున్న ఆధిపత్య అగ్రకుల పెత్తందారులను అరెస్టు చెయ్యాలని కోరుతూ 8న జరుగుతున్న సదస్సును జయప్రదం చెయ్యాలని కెవిపిఎస్ పిలునిచ్చింది. మండలంలోని ఉలవపాళ్ల, అనంతవరం, లైన్ నగర్ , దగదర్తి, చెన్నూరు, రంగసముద్రం, తురిమెళ్ల, పెద్దపుట్టేడు, శ్రీరామపురం తదితర గ్రామాలలో కెవిపిఎస్ బృందం పర్యటించి గ్రామాల్లోని దళితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రంగసముద్రం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలు, మన రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన కులదురహంకార దాడులు పెరిగాయన్నారు. దగదర్తి మండలంలో ఉప్పలపాడు, ఉలవపాళ్ళ, చెన్నూరు, దగదర్తి గ్రామాల్లో దళిత, బలహీన వర్గాలపై దాడులు జరగాయన్నారు. దళితులకు అండగా నిలవాల్సిన పోలీసులు దాడి చేసిన వారికే కొమ్ముకాస్తూ కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. దళితులకు అండగా నిలబడాలని కోరారు. దళితుల హక్కులపై చైతన్యం కావాలన్నారు. ఈ హక్కులపై  పిబ్రవరి 8న ఉదయం10 గంటలకు దగదర్తిలోని జక్కా వెంకయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని ప్రజలు, దళిత సంఘాలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ రఘురామయ్య, ఆలూరి తిరుపాలు, మండల నాయకులు కర్ర పోలయ్య, ఒంటేరు సుధాకర్, మందా సీనయ్య, తలారి రవి, వడ్లపూడి శూలాం తదితరులు పాల్గొన్నారు.