Aug 10,2023 18:59

ప్రజాశక్తి - మదనపల్లె అర్బన్‌ : సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించింది. నెల రోజులుగా ఆకాశాన్ని అంటిన టమాట ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత నెల 30న కిలో టమాట రూ.196 పలకగా... ప్రస్తుతం రూ.50కు పడిపోయింది. గత నాలుగు రోజులుగా అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌కు దిగుబడి పెరగడంతో ధరలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. గురువారం ఏ గ్రేడ్‌ కిలో టమాట రూ.50 నుంచి రూ.64 వరకు, బి గ్రేడ్‌ రూ.36 నుంచి రూ.48 పలికింది. సగటున కిలో రూ.44 నుంచి రూ.60 పలికింది.
మదనపల్లి మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా గత నెల 30న కిలో టమాట రూ.196 పలికింది. ఇక వినియోగదారులకు చేరేసరికి ఆ రేటు భారీగా పెరిగిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సబ్సిడీ పేరుతో కిలో రూ.50కు రాష్ట్రంలోని మార్కెట్‌ సెంటర్లలో విక్రయించింది. ఇతర రాష్ట్రాల నుంచి టమాటను తెప్పించేందుకు ప్రయత్నించింది. గత మూడు రోజులుగా రోజు రోజుకు టమాట దిగుబడి పెరగడం, ఇతర రాష్ట్రాలలో టమాట పంట సాగు పెరగడంతో రేట్లు తగ్గుముఖం పట్టినట్టు వ్యాపారస్తులు చెబుతున్నారు మదనపల్లి మార్కెట్‌లో బుధవారం మొదటి రకం 10 కిలోల టమాట గరిష్టంగా రూ.1040 పలకగా కనిష్టంగా రూ.1020, రూ.960 పలికింది. రెండవ రకం గరిష్టంగా రూ.940 పలకగా కనిష్టంగా రూ.900, రూ.800 పలికింది. 351 మెట్రిక్‌ టన్నుల టమాట మార్కెట్‌కు చేరాయి. గురువారం మొదటి రకం 10 కిలోలు గరిష్టంగా రూ.640 పలకగా కనిష్టంగా రూ.600 నుంచి రూ. 500 పలికింది. రెండవ రకం గరిష్టంగా 480 పలకగా కనిష్టంగా రూ.440 నుంచి రూ. 360 పలికింది. 391 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌కు చేరాయని వ్యాపారస్తులు తెలిపారు. రేట్లు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అప్పుల ఊబిలో నుండి బయటపడుతున్న తరుణంలో ఒక్కసారిగా రేట్లు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిలకడగా టమాట రేట్లు ఉండేలా చూడాలని కోరుతున్నారు.