Jul 08,2021 21:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) సమావేశం వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని బోర్డు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్ట్రానికి సమాచారం అందింది. గతంలో ప్రకటించిన మేరకు నేడు (శుక్రవారం) బోర్డు సమావేశం జరగాల్సిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా తలెత్తిన జలవివాదం నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత నంతరించుకుంది. అయితే, ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని, 20 వతేది తరువాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు లేఖ రాయడంతో పాటు, శుక్రవారం సమావేశం జరిపితే తాము హాజరుకాబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం సమావేశానికి హాజరు కావడానికి, తమ వాదన వినిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించడం పట్ల రాష్ట్ర అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని తక్షణమే పరిష్కరించాల్సిఉండగా, దానికి భిన్నంగా వాయిదా ఎలా వేస్తారని, పైగా సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటించకపోవడం ఏమిటని వారు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను ఆపివేయడంతో పాటు కృష్ణానదీ ప్రాజెక్టుల్లో విధ్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఖరీఫ్‌సాగుకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్న సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల రిజర్వాయర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తుండటంతో ఆ నీరు వృథాగా సముద్రం పాలవుతోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అయినా, కీలకమైన బోర్డు సమావేశం వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.