మన దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినట్టు కన్పిస్తున్నా, ముప్పు పొంచే ఉంది. ఈ నెలలో తగ్గుతూ వచ్చిన తీవ్రతను చూసి గండం గడిచింది అనుకుంటే పొరపాటే. కరోనా టీకా పూర్తిగా అందుబాటు లోకి వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. తేలిగ్గా తీసుకుంటే ఎంత ప్రమాదమో ఢిల్లీ అనుభవం తెలియజేస్తోంది. గత నెల వరకూ అక్కడ కేసులు తగ్గుతూ వచ్చాయి. ప్రజల్లో కరోనా జాగ్రత్తల పట్ల కొంత ఉదాసీనత వచ్చింది. మాస్కులు లేవు. భౌతిక దూరం పాటించడం లేదు. ఫలితంగా నవంబర్ 1 నుంచీ మళ్లీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ వారంలో రోజుకి వంద మరణాలు నమోదవుతూ, నిన్న 131 రికార్డ య్యాయి. పరిస్థితి ఇలా విషమించడంలో అందరి తప్పు ఉంది. ఎవరికి వారు బాధ్యత పడాల్సిన సమయమిది. మన రాష్ట్రంలో కూడా కరోనా ని తేలిగ్గా తీసుకొనే ప్రకటనలు వస్తున్నాయి. ఎన్నికలు, రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. గుంపుల్ని, ప్రజా సమూహాల్ని, వేడుకల్ని ప్రోత్సహించే సమయం కాదు. స్వచ్ఛందంగా 144 సెక్షన్ అమలు చేసుకోవాల్సిన సమయం. మాస్కు వినియోగం, భౌతిక దూరం, చేతుల శుభ్రత పాటించడంలో ఏమాత్రం రాయితీలు లేవు. పాటించి తీరాల్సిందే.
* డా|| డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.










