Jan 22,2021 07:36

ఉలాన్‌ బాతార్‌ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక ఓ దేశ ప్రధాని రాజీనామా చేశారు. కోవిడ్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ నిరసనలు వెల్లువెత్తడంతో మంగోలియా ప్రధాని ఖురేల్‌సుఖ్‌ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్‌లో సమర్పించారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజల డిమాండ్‌ మేరకు, ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా బారిన పడ్డ బాధితురాలు, ఆమె నవజాత శిశువు పట్ల అమానవీయంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడంతో నిరసనలు చెలరేగాయని మీడియా పేర్కొంది. ఈ ఆందోళనలు అట్టుకుడటంతో సీనియర్‌ ఆరోగ్య అధికారులను తొలగించాల్సి వచ్చింది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ కుంచించికుపోవడం, నిరుదోగ్యం పేరుకుపోవడంతో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నిరసనల సెగను తట్టుకోలేక వెంటనే ఉప ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి సైతం రాజీనామా చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రధాని రాజీనామాను సమర్పించాల్సి వచ్చిందని పేర్కొంది. కరోనా ప్రారంభమైన వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసి...ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నుండి ప్రశంసలు పొందిన మంగోలియా...ఇప్పుడు మహమ్మారిని నియంత్రించలేక అల్లాడుతోంది.