ప్రజాశక్తి-తెనాలి : తల్లిని తిట్టొద్దన్న మాటను మందుబాబు జీర్ణించుకోలేక పోయాడు. క్షణాల్లోనే కత్తితో దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగుపెడుతూ కుప్పకూలిపోయిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ మన్నెం మురళి వెల్లడించిన వివరాల ప్రకారం ఖాజీపేటకు చెందిన తిరుమలశెట్టి నాగరాజు ప్లంబర్. నాలుగేళ్ల క్రితం వివాహమైన నాగరాజు కొలకలూరు మెయిన్ సెంటర్‌కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన సొంత పెద్దమ్మ కొడుకైన రాము మహేష్ ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మహేష్ ప్రస్తుతం కడపలో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం చుట్టంచూపుగా మహేష్ కొలకలూరుకు వచ్చాడు. ఈ క్రమంలో మహేష్ మద్యం మత్తులో నాగరాజు తల్లిని విచక్షణా రహితంగా దూషి స్తుండటంతో సహించలేని నాగరాజు అతనిని వారించాడు. సరేనంటూ కొద్దిసేపు మౌనం వహించిన మహేష్ ఒక్కసారిగా నాగరాజుపై కత్తితో దాడి చేశాడు. అనుకోకుండా జరిగిన పరిణామంతో తీవ్ర రక్తస్రావంతో నాగరాజు రోడ్డు వైపు పరుగుతీస్తూ కుప్పకూలి పోయాడు. నిందితుడు అందరూ చూస్తుండగానే దర్జాగా వెళ్ళిపోయాడు. స్థానికులు స్పందించి అంబులెన్స్ సాయంతో నాగరాజును వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ ఎం.మురళి పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడు బటన్‌నైఫ్‌తో దాడి చేయడంతో ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిందా..పాతకక్షలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.










