Mar 16,2023 21:40
  • రెండు ప్రింటర్లు, ఒక కంప్యూటర్‌, మానిటర్‌, లామినేషన్‌ మిషన్‌ స్వాధీనం

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో వరుస దాడులు చేసి రూ.44.50 లక్షల దొంగనోట్లను పట్టుకున్నారు. ఓ మహిళ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్‌పి సతీష్‌ కుమార్‌ చింతూరులోని ఐటిడిఎ మీటింగ్‌ హాలులో గురువారం విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఎటపాక సిఐ గజేంద్రకుమార్‌, కూనవరం ఎస్‌ఐ బి.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 15న విఆర్‌.పురం మండలం రేఖపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, భద్రాచలం గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎనిమిది మంది పురుషులను, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పొదిల మురళి, జంగం శ్రీనివాస్‌, కటారి సామ్రాజ్యం, గౌడుగోళ్ల కిరణ్‌ కుమార్‌, పాకపాటి నాగేశ్వరరావు, పసుపులేటి ఉమేష్‌ చంద్ర, వేముల పుల్లారావు, పొదిలి శ్రీనివాస్‌, కొనకళ్ల చిట్టిబాబు ఉన్నారు. వీరందరూ గ్రూపులుగా ఏర్పడి పాల్వంచలోని పొదిల మురళి ఇంటి వద్ద రహస్యంగా దొంగ నోట్లు ముద్రించి చింతూరు, నెల్లిపాక, విఆర్‌.పురం, కూనవరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కుంట గ్రామాల్లో మార్చేవారు. రూ.10 వేలు అసలు నోట్లకు రూ.లక్ష దొంగనోట్లు ఇచ్చేవారు. రాత్రి వేళల్లో ఆయిల్‌ బంకుల్లోనూ, కిరాణా షాపుల్లోనూ, హోటళ్లలోనూ మార్పిడి చేసేశారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నకిలీ నోట్లతోపాటు రెండు ప్రింటర్లు, ఒక కంప్యూటర్‌, మానిటర్‌, లామినేషన్‌ మిషన్‌, రూ.500 నోటు సైజుల్లో కటింగ్‌ చేసిన బ్లాక్‌ కలర్‌ బండిల్స్‌, బజాజ్‌ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరు పర్చారు. జంగం శ్రీనివాస్‌, పి.నాగేశ్వరరావులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్‌పి తెలిపారు.