న్యూఢిల్లీ : సామాన్య మానవుల్లా అంధులు అన్నింటినీ చూడలేరు. చదవలేరు. చూపు లేకున్నా బ్రెయిలీ లిపి రూపంలో చదువుకు ఆస్కారం కలిగింది. అయితే అదీ అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కింద స్థాయి చదువుల వరకు ఇది సరిపోయినా.. ఉన్నత చదువుల కోసం తిప్పలు పడాల్సిందే. చాలా వరకు మెటీరియల్ అంతా పుస్తకాలు, పిడిఆఫ్ రూపంలో పొందుపరుచుకుని ఉంటాయి. ఇవి ఎవరితోనైనా చెప్పించుకోవడమే... బుక్స్ ఆడియో రూపంలో విని నేర్చుకోవడమే చేస్తారు. అయితే పలుమార్లు ఆ పుస్తకాలు కూడా అందుబాటులో ఉండవు. కొన్ని సార్లు ఖర్చుతో కూడకున్న పని కూడా అవుతుంది. వారి బాధలను గుర్తించిన కోయంబత్తూర్‌కు చెందిన శాంతియా రాజన్ వినూత్నంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టారు. ఆమె,తన బృందంతో కలిసి పారాక్లేట్ ఇమేజ్ ల్యాబ్ అనే స్టార్టప్ నెలకొల్పారు. ఇది ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్, డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దృష్టి లోపం ఉన్న వారికి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి ప్రకాశ్ అని పేరు పెట్టారు. ఇందులో డాక్యుమెంట్లు స్కాన్ చేయగానే...బిగ్గరగా చదువుతుంది.
కోయంబత్తూర్‌లోని బన్నారీ అమ్మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలీజీలో బిటెక్ పూర్తి చేసిన రాజన్ 2017లో శ్రీ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ సెకండియర్‌లో ఉండగానే ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడం ప్రారంభించారు. 2020లో డిసెంబర్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలుత ప్రతి ఇంటికి వెళ్లీ ఈ యాప్ గురించి చెప్పాలని భావించినప్పటికీ..కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ బృందానికి బెంగళూరుకు చెందిన వి హబ్, ఆర్‌టీ ల్యాబ్స్ మద్దతు పలికాయి. వినియోగదారుడు ఒక్కసారి రూ. 40 వేలు చెల్లించి..ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కుంటే జీవితాంతం వారు ఎప్పుడైనా,ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రోడ్, కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో 500 మందిని చేరుకోగలిగింది ఈ బృందం. కేవలం బిగ్గరగా చదివి వినిపించడమే కాకుండా, పరీక్ష రాసే సదుపాయాన్ని కూడా ఈ సాఫ్ట్‌వేర్ కల్పిస్తోంది. ఇప్పటి వరకు ఇతరులు వారికి పరీక్ష రాసిపెట్టేవారు. కానీ ఈ సాఫ్ట్‌వేర్ ఆ సమస్యనూ తీర్చనుంది. మొదట పరీక్ష పేపరును చదువుతుంది. జవాబులు నోటితో చేబితే చాలు, వెంటనే పిడిఎఫ్ డాక్యుమెంట్ తయారైపోతుంది. వీటిని ఎగ్జామినర్‌కు పంపిస్తుంది.










