Jul 17,2021 15:49

రోమ్‌ : కోట్ల విలువైన ఆస్తిని ఎవరైనా రూపాయిలకే అమ్ముతారా? అది కూడా తన దగ్గరే పనిచేసే ఉద్యోగి కోసం...? ఈ ప్రపంచంలో సగటు యజమాని ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారా..? ఉన్నారండీ బాబూ..! తన కోట్ల విలువైన సెలూన్‌ షాప్‌ని తన దగ్గర పనిచేసే ఉద్యోగికి కేవలం ఒక్క డాలర్‌ (ఇండియన్‌ కరెన్సీలో రూ. 74.91)కే అమ్మాడు. వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన పియస్‌ అనే వ్యక్తి 1965లో రోడ్‌ సైడ్‌ చిన్న బార్బర్‌ షాప్‌ పెట్టుకొని జీవనం సాగించేవాడు. అతను చిన్న బార్బర్‌ షాపు నుంచి ప్రముఖ హెయ్‌ి సెలూన్‌ ఓనర్‌దాకా అంచెలంచెలుగా ఎదిగారు. కోట్ల విలువైన సెలూన్‌ ఉన్నా.. తన అభిరుచితో.. సివిల్‌ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తుండేవారు. సరిగ్గా అదే సమయంలో తనకు కాథీ మౌరీ అనే స్కూలు విద్యార్థిని తనకు జాబ్‌ కావాలి అంటూ పియస్‌కి ఫోన్‌ చేసింది. స్కూలు విద్యార్థిని కాథీ.. పియస్‌కే ఎందుకు కాల్‌ చేసిందంటే.. తాను పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు జాబ్‌ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదట. ఆ సమయంలో కాథీ తన స్కూల్‌ టీచర్‌ని ఎక్కడైనా తనకు జాబ్‌ ఇప్పించమని కోరగా..సదరు టీచర్‌ ఆమెకు పియస్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. అంతే వెంటనే కాథీ... పియస్‌కి ఫోన్‌ చేయడం.. తన సెలూన్‌ షాపులో జాబ్‌లో జాయిన్‌ అవ్వడం చకచకా జరిగిపోయాయి. చివరగా సీన్‌ కట్‌ చేస్తే.. ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం ఉద్యోగిగా జాయిన్‌ అయిన కాథీ ఇప్పుడు ఆ సెలూన్‌ షాపుకి ఓనర్‌ అయింది.
తన కోట్ల విలువైన షాపును కాథీకి కేవలం ఒక్క డాలర్‌కే అమ్మడంపై పియస్‌ మాట్లాడుతూ..'కాథీ చాలా మంచి అమ్మాయి. పైగా మంచి హెయిర్‌ స్టైలిష్ట్‌. గత 15 ఏళ్లుగా నాతోనే పనిచేసింది. కాథీ షాపు నిర్వహించే తీరు నాకెంతో నచ్చుతుంది. అందుకే వేరెవరికో షాపును అమ్మే బదులు కాథీకే ఒక్క డాలర్‌కే అమ్మాను' అని అన్నారు. అయితే ఇలా ఒక్క డాలర్‌కే షాప్‌ని అమ్మడంపై కాథీ ఒప్పుకోలేదని ఆమెని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పియస్‌ చేసిన పనికి, ఉద్యోగి పట్ల చూపిన ప్రేమకి నెటిజన్లు తనని ప్రశంసిస్తున్నారు.