న్యూఢిల్లీ : ఒక్కరోజు క్షీణతతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపన్నుల జాబితాలో ఐదోస్థానానికి జారిపోయినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఆయన సంపదలో 23 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయని.. అమెజాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డు నమోదైందని నివేదిక పేర్కొంది. గురువారం మార్కెట్ ముగింపునాటికి షేర్లు 21 శాతానికి క్షీణించాయి. ఈ క్షీణత శుక్రవారం ఉదయం కూడా కొనసాగింది. రికార్డు ప్రకారం.. బెజోస్ గతేడాది జులైలో 214 బిలియన్ డాలర్లు కలిగి ఉండగా, ఈ ఏడాది ఆయన సంపద దాదాపు సగానికి 111 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయం పెరగడంతో పాటు డిమాండ్‌లో తగ్గుదల అమెజాన్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాదిలో గురువారం ముగింపు నాటికి కంపెనీ షేర్లు దాదాపు 33 శాతం క్షీణించింది. బెజోస్ అమెజాన్‌లో దాదాపు 996 మిలియన్ షేర్లను కలిగిఉన్నారు.










