పుట్టపర్తి అర్బన్ : జిల్లా సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రజలతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సమిష్టగా పని చేయనున్నట్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పి.బసంత్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. పుట్టపర్తి పట్టణం వద్దనున్న పరేడ్ గ్రౌండ్ (శిరసాని హిల్స్)లో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
అభివృద్ధి దిశగా అడగులు
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న అభివద్ధి పనులను సద్వినియోగం చేసుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా ముందండుగు వేస్తోందని కలెక్టర్ బసంత్‌కుమార్ పేర్కొన్నారు. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం కన్నా 49.7 శాతం అధిక వర్షాలు కురిశాయన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు రెండు విడతలుగా 308.18 కోట్ల రూపాయలు 2.70 కుటుంబాలకు అందించామన్నారు. ఈ క్రాప్ ద్వారా జిల్లాలో పంటల వివరాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు. 2021-22లో పంట నష్టం పోయిన రైతులకు 14.71 కోట్లు పంట నష్టపరిహారం అందించామన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద అర్జెంట్ 1082 గ్రూపులకు 5.30 కోట్లు సబ్సిడీ విడుదల, సున్నా వడ్డీ పంట రుణాలు 25.43 కోట్లు 1.31 లక్షల మందికి విడుదల చేశామన్నారు. నవరత్నాల కింద పేదలందరికీ ఇళ్లు కింద 171 లేఅవుట్‌లలో 32,104 ప్లాట్లకు 118.68 కోట్లు మౌలిక సదుపాయాలకు మంజూరు అయ్యాయని చెప్పారు. పాల ఉత్పత్తికి జలకల ద్వారా రైతులకు ఉచిత బోర్లు మంజూరు చేశామన్నారు. 2.66 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు 67.65 కోట్లు మంజూరు చేశామన్నారు. జగనన్న తోడు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నాడు-నేడు పథకం విద్యాభివద్ధి జగనన్న దీవెన, వైఎస్సార్ భూ రీసర్వే, భూ రక్ష తదితర పథకాలన్నీ అమలవుతున్నాయని అన్నారు. జపాన్ బ్యాంకు నిధులతో చేపట్టిన కుముద్వతి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రామ వార్డు సచివాలయుల ద్వారా ప్రభుత్వ పాలన ప్రజలకు ముంగిట తీసుకెళ్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు భరోసా హెల్త్ క్లీనిక్ తదితర ప్రాధాన్యత భవనాలను నిర్మిస్తున్నామన్నారు. స్పందన, గడపగడప కార్యక్రమాల్లో వచ్చిన వినతలు 90 శాతం పరిష్కారం అవుతున్నాయన్నారు. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, అదనపు ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌తో పాటు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు, సాంస్కతిక కార్యక్రమాలు, స్టాల్స్
గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శకటాలను ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల డివిజన్, మండల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ పి.బసంత్ కుమార్ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు పోలీస్ జాగిలాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.










